అది రాహుల్ అహంభావమా లేక నిర్లక్ష్యమా?

August 10, 2018


img

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ఆ పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా వేరే పార్టీ అభ్యర్ధిని నిలబెట్టడానికి సిద్దపడిన కాంగ్రెస్‌, చివరి నిమిషంలో స్వంతపార్టీకే చెందిన కె.హరిప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించడం పెద్ద తప్పు. ఆ కారణంగా ఆమాద్మీ, వైకాపా వంటి కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ అభ్యర్ధికి మద్దతు ఈయలేదు. 

అంతకంటే పెద్ద తప్పు రాహుల్ గాంధీ స్వయంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయకపోవడం. ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడటం అయన చిన్నతనంగా భావించారో లేక ప్రతిపక్షాలు తమకు కాక మరెవరికి మద్దతు ఇస్తాయనే ధీమాతో ఉన్నారో తెలియదు కానీ అయన స్వయంగా ఎవరికీ ఫోన్లు చేసి మద్దతు కోరలేదు. రాహుల్ గాంధీ కోరితే మద్దతు ఇస్తామని ఆమాద్మీ అధినేత, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినా రాహుల్ గాంధీ ఫోన్ చేయకపోవడం గమనార్హం. 

అదేవిధంగా భాజపాకు దూరమైన పిడిపి (జమ్ము కాశ్మీర్), బిజెడి (ఓడిశా), శివసేన (మహారాష్ట్ర), వైకాపా (ఏపి) తదితర పార్టీల అధినేతలతో రాహుల్ గాంధీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనుక ఆ పార్టీల మద్దతు లభించలేదు. అదే...భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా శివసేన తదితర పార్టీల నేతలకు ఫోన్లు చేసి వారి మద్దతు కూడగట్టి ఎన్డీయే అభ్యర్ధిని గెలిపించుకొన్నారు. కనుక ఈ విషయంలో రాహుల్ గాంధీ నిర్లిప్తత లేదా నిర్లక్ష్యం కాంగ్రెస్‌ అభ్యర్ధి పాలిట శాపంగా మారిందని చెప్పవచ్చు. 

వచ్చే ఎన్నికలలో దేశంలో భాజపాయేతార పార్టీలను అన్నిటినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌ నేతృత్వంలో ఎన్డీయే కూటమిని ఓడించి అధికారంలోకి రావాలని ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ప్రతిపక్షాల ఐక్యతను, శక్తిని చాటిచెప్పుకోగల ఇటువంటి గొప్ప అవకాశాన్ని రాహుల్ గాంధీ వదులుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కాంగ్రెస్‌ అభ్యర్ధిని గెలిపించుకొని ఉండి ఉంటే, దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్‌ నేతృత్వంలో భాజపాపై పోరాటానికి ముందుకు వచ్చి ఉండేవి. కానీ రాహుల్ గాంధీ ఒక మంచి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకొన్నారు. గతంలో ఇటువంటి సందర్భాలలో అప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వ్యవహరించిన సోనియా గాంధీ స్వయంగా చొరవ తీసుకొని ప్రతిపక్ష నేతలను కలిసి లేదా ఫోన్లు చేసి వారి మద్దతు కూడగట్టేవారు. కానీ రాహుల్ గాంధీ అది కూడా చేయలేకపోయారు. కనుక వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీ తన అహాన్ని పక్కనపెట్టి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తే మంచిది.


Related Post