కాళేశ్వరంకు జాతీయహోదా ఇవ్వలేము: కేంద్రం

August 10, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేమని కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్ గడ్కారీ నిన్న లోక్ సభలో స్పష్టంగా తేల్చిచెప్పేశారు.  అయన ఈ విషయం ప్రకటిస్తున్నప్పుడు సభలో ఉన్న తెరాస ఎంపిలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించినందున కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా ఇవ్వాలని తెరాస సభ్యులు పట్టుపట్టడం సరికాదని, ఏపికి విభజన హామీలలో భాగంగానే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమని నితిన్ గడ్కారీ తెలిపారు. భవిష్యత్ లో మరే ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా కల్పించబోమని నితిన్ గడ్కరీ స్పష్టంగా చెప్పారు. అయన ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెరాస ఎంపి వినోద్ కుమార్, దానిపై అభ్యంతఃరం నిరసన తెలియజేస్తూ ఆయనకు వెంటనే ఒక లేఖ వ్రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తప్పనిసరిగా జాతీయహోదా కల్పించాలని ఆ లేఖలో కోరారు. 

తెరాస ఎంపిలు మరికొద్ది సేపటిలో ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ బైసన్ పోలో గ్రౌండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరనున్నారు. దానితోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని కోరుతూ మళ్ళీ వినతిపత్రం ఈయనున్నారు. 

కేంద్రప్రభుత్వం నిర్ణయాన్నే నితిన్ గడ్కారీ నిన్న లోక్ సభలో ప్రకటించినట్లు చెప్పవచ్చు. కనుక దీనికోసం తెరాస ఎంపిలు ప్రధాని మోడీకి వినతిపత్రం ఇచ్చిన ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయం వలన తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురయయి ఎన్నికలలో భాజపా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కనుక తెరాస ఎంపిలు కాళేశ్వరం ప్రాజెక్టుకు బారీగా నిధులు మంజూరు చేయమని ఒత్తిడి చేసినట్లయితే మంజూరు చేయవచ్చునేమో?


Related Post