తెరాస-భాజపాలది వియ్యమా కయ్యమా?

August 10, 2018


img

భాజపా విషయంలో సిఎం కేసీఆర్‌ చాలా గుంభనంగా, లౌక్యంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పవచ్చు. ఒకపక్క అవసరమైనప్పుడల్లా కేంద్రానికి అండగా నిలబడుతూనే, మరోపక్క కేంద్రాన్ని గట్టిగా నిలదీయిస్తుంటారు. ఉదాహరణకు రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెరాస ఎంపిలు ఎన్డీయే అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేశారు. కానీ అదే సమయంలో లోక్ సభలో తెరాస ఎంపిలు మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. 

కొత్త సచివాలయ నిర్మాణం కోసం సికింద్రాబాద్‌లోని రక్షణశాఖకు చెందిన బైసన్ పోలో భూములు ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం జాప్యం చేస్తున్నందుకు ఎంపి జితేందర్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపట్టారు. సిఎం కేసీఆర్‌ కేంద్రానికి అనేక లేఖలు వ్రాసినా, దీనికోసం ప్రధాని నరేంద్రమోడీని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తోందని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం కోరిన వెంటనే బెంగళూరులోని రక్షణశాఖకు చెందిన భూములను ప్రభుత్వానికి అప్పగించిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణా ప్రభుత్వం వినతులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణా రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తెలంగాణా పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వాదించారు. భూముల బదలాయింపు విషయంలో కేంద్రం విధించిన అన్ని షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని గట్టిగా నిలదీశారు. దీనిపై రక్షణమంత్రి సమాధానం చెప్పాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

మోడీ సర్కార్ పట్ల తెరాస అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరితో సిఎం కేసీఆర్‌ భాజపాను, ఎన్డీయే ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారో తెలియనీయకుండా తన రాజకీయ ప్రత్యర్ధులను తికమకపెడుతున్నారు. అయన మోడీ కనుసన్నలలో పనిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదే నిజమైతే నిన్న లోక్ సభలో జితేందర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడి ఉండరు. అలాగని మోడీతో కేసీఆర్‌కు దోస్తీ లేదనుకోవడానికి లేదు. నాలుగేళ్ళు స్నేహం ఉన్న చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ లభించదు. కానీ మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంటులో ఎండగడుతున్న తెరాస అధినేత కేసీఆర్‌కు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ లభిస్తుంది.     వారి దోస్తీకి ఇదే మంచి ఉదాహరణ. వారి దోస్తీ ఎంత బలంగా ఉందో నిన్ననే రాజ్యసభలో మరోమారు నిరూపించబడింది. 

మోడీ-కేసీఆర్‌ దోస్తీని, తెరాస-భాజపా శత్రుత్వాన్ని ఏవిధంగా నిర్వచించాలో తెలియని పరిస్థితి నెలకొంది. దీని వలన తెరాసకు ఎటువంటి నష్టమూ ఉండదు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపాలే తికమకపడుతున్నాయి. 


Related Post