తెరాస-భాజపా పొత్తులు ఖాయం: రేవంత్ రెడ్డి

August 09, 2018


img

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాస-భాజపాలు పొత్తులు పెట్టుకోవడం ఖాయం అని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెరాస ఎంపిలు ఎన్డీయే అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా తెరాస భాజపాకు దగ్గరయ్యేందుకు ఆసక్తిగా ఉందని అర్ధమవుతోందని అన్నారు. 

కరుణానిధి అంత్యక్రియలలో పాల్గొనడానికి సిఎం కేసీఆర్‌ నిన్న ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళారని ఆ విమానం మోడీకి ఆప్తమిత్రుడు గుజరాత్ కు చెందిన అధానీ గ్రూప్ అధినేత గౌతం అధానీదని రేవంత్ రెడ్డి అన్నారు. మోడీకి కేసీఆర్‌ బంధం బలపడేందుకు అధానీ కీలకపాత్ర పోషిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

అందుకు ప్రతిగా సిఎం కేసీఆర్‌ అధానీ గ్రూపుకు మేలు చేసేందుకు ఆ సంస్థ బొగ్గు సరఫరా చేస్తున్న మార్వా విద్యుత్ ఉత్పత్తి సంస్థ నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలులో బారీ అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటువంటి నిర్ణయాలతో ఒకపక్క రాష్ట్రాన్ని అప్పులలోకి నెట్టేస్తూ, మరోపక్క సిఎం కేసీఆర్‌ తన కుటుంబ ఆస్తులు మాత్రం పెంచుకొంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

రాజకీయ పార్టీలు తమకు నచ్చిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవచ్చు. కనుక ఒకవేళ తెరాస-భాజపాలు పొత్తులు పెట్టుకొన్నా, కాంగ్రెస్‌-తెదేపాలు పొత్తులు పెట్టుకొన్నా తప్పు పట్టలేము. కానీ కాంగ్రెస్‌, తెరాస నేతలు పొత్తుల విషయంలో పరస్పరం విమర్శించుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. తెదేపాతో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి కాస్త స్పష్టంగానే ఉంది. నేడో రేపో దానిపై అధికారిక ప్రకటన చేసే సూచనలు కనిపిస్తునాయి. 

ఇక తెరాస విషయానికి వస్తే దానికి రాష్ట్రంలో భాజపాతో పొత్తులు పెట్టుకోవలసిన అవసరమే లేదు. కానీ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్‌-భాజపాల మద్య డైరెక్ట్ వార్ జరగనిస్తే దాని వలన కాంగ్రెస్‌ లాభపడవచ్చు. అదే కాంగ్రెస్‌-తెరాస మద్య డైరెక్ట్ వార్ జరిగితే, కాంగ్రెస్ పార్టీపై తెరాస పైచెయ్యి సాధించగలదు. బహుశః అందుకే అవసరం లేకపోయినా భాజపాతో పోత్తులకు సిద్దపడతారేమో? బహుశః అందుకే సిఎం కేసీఆర్‌ మోడీతో సఖ్యతగా ఉంటున్నారేమో?

ఇక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాల నుంచి మోడీ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకవేళ ఆ కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత మంది ఎంపిలు లేకపోతే, కేసీఆర్‌ వంటి నమ్మకమైన స్నేహితులు అవసరం చాలా ఉంటుంది. అదీగాక తెలంగాణాలో తెరాసతో పొత్తులు పెట్టుకోగలిగితే వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వంలో భాజపాకు అవకాశం కల్పించాలని ఆశిస్తున్నారేమో? ఎన్నికలు దగ్గర పడితే గానీ తెరాస-భాజపాల మద్య అనుబంధంపై స్పష్టత రాదు.


Related Post