తమ్ముడు తమ్ముడే...పేకాట పేకాటే!

July 20, 2018


img

తమ్ముడు తమ్ముడే...పేకాట పేకాటేనన్నట్లు కేంద్రంతో బలమైన సత్సంబంధాలు కలిగి ఉన్న తెరాస, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని నిలదీయడానికి ఏమాత్రం సంకోచించబోమని స్పష్టం చేసింది. అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ తెరాస ఎంపి వినోద్, తెలంగాణా రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ మొదటి నుంచి కూడా సవతి తల్లి ప్రేమే కనబరుస్తోందని మరోమారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అది తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఏపిలో కలపడంతో మొదలైందని, నేటికీ అది కొనసాగుతూనే ఉందని అన్నారు. 

చంద్రబాబు నాయుడు కోసమే కేంద్రప్రభుత్వం హడావుడిగా తెలంగాణాలోని ఏడు ముంపు మండలాలను రాష్ట్రం నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్ లో కలిపేసిందని, కేంద్రం చేసిన ఆ తప్పుకు రాష్ట్ర ప్రజలు భాజపాను ఎన్నటికీ క్షమించబోరని వినోద్ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఇచ్చినా తెలంగాణాలో ఎవరికీ అభ్యంతరం లేదని కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా నిధులు, జాతీయహోదా ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.   

హైకోర్టు విభజన, నదీజలాల పంపిణీ విషయంలో చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా ప్రేక్షకుడిలా చోద్యం చూస్తోందని అన్నారు. మరోపక్క రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కోర్టులలో పిటిషన్లు వేసి అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా తమ ప్రభుత్వం చిత్తశుద్ధిగా చేస్తున్న ప్రయత్నాల వలన దేశంలో తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వినోద్ అన్నారు. 

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం ఆశించిన స్థాయిలో చేయూత ఇవ్వడం లేదని వినోద్ ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు ఎందుకు వెనకాడుతోందని వినోద్ కేంద్రాన్ని నిలదీశారు. మిషన్ కాకతీయ పధకానికి రూ.5,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా కేంద్ర ఆర్ధికశాఖ నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. కానీ ఈ నాలుగేళ్ళలో కేంద్రం అందించిన సహకారం వలననే తెలంగాణాలో జాతీయరహదారులు దాదాపు రెట్టింపు అయ్యాయని ప్రశంసించారు. ఇదేవిధంగా మిగిలిన అన్ని పనులు, పధకాలకు కేంద్రప్రభుత్వం తెలంగాణాకు సహకారం అందిస్తుందని ఆశించామని కానీ నిరాశ కలిగించిందని వినోద్ అన్నారు.


Related Post