త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణా పర్యటన

July 19, 2018


img

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణాలో పర్యటించబోతున్నారని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జూలై నెలాఖరు లేదా ఆగస్ట్ మొదటివారంలో సిరిసిల్లలో ఒక బారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, దానిలో రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు. నేరెళ్ళ, ఖమ్మం ఘటనలలో దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా అమానుషంగా ప్రవర్తించినందుకు, సిరిసిల్లలో నిర్వహించబోయే ఆ సభను దళితుల ఆత్మగౌరవసభగా నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నేటికీ నేరెళ్ళలో దళితులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని కానీ ప్రభుత్వానికి చీమకుట్టినంత బాధ అయినా కలుగడంలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న గద్వాల్ లో కొన్ని రోజుల క్రితం సిఎం కెసిఆర్ బారీ బహిరంగసభ నిర్వహిస్తే, ఇప్పుడు మంత్రి కేటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బహిరంగసభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ప్రదర్శించుకోవడానికి సిద్దపడుతోందని భావించవచ్చు. ఆ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారు కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ దానిని విజయవంతం చేయడానికి శాయాశక్తుల కృషి చేస్తారని వేరే చెప్పనవసరం లేదు. కనుక కెసిఆర్ స్వయంగా సృష్టించిన ఈ ఎన్నికల వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న ఈ బహిరంగసభతో ఆ రెండు పార్టీల మద్య యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులు తమతో టచ్చులో ఉన్నారని సమయం వచ్చినప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే చెప్పేవారు. కానీ ఇప్పటివరకు తెరాస నుంచి పెద్ద నేతలు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కనుక సిరిసిల్లలో నిర్వహించబోయే ఆ సభలో కనీసం ఒకరిద్దరు పెద్ద నేతలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. కనుక తెరాస కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.


Related Post