నేనెక్కడి నుంచి పోటీ చేస్తానంటే...కవిత

July 19, 2018


img

నిజామాబాద్ తెరాస ఎంపి కవిత గత కొంత కాలంగా తన స్వంత నియోజకవర్గం కంటే జగిత్యాలలో ఎక్కువగా పర్యటిస్తూ అక్కడి ప్రజలు, కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఆమె వచ్చే ఎన్నికలలో అక్కడి నుంచే శాసనసభకు పోటీ చేయబోతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలలోపు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలో వెళతానని సిఎం కెసిఆర్ ప్రకటించడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్లయింది.

సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళినట్లయితే, ఆయన కుమారుడు కేటిఆర్ ముఖ్యమంత్రి పదవి అధిష్టించవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో కవిత శాసనసభకు పోటీ చేసి గెలిచి అయన మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరిస్తారని ఒక వాదన వినిపిస్తోంది. కెసిఆర్ తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక వచ్చే ఎన్నికల తరువాత తెరాస అధికారంలోకి వస్తే కవితకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ విమర్శలకు జవాబు చెప్పినట్లవుతుంది కూడా. బహుశః అందుకే ఆమె జగిత్యాలను ఎంచుకొని ఆ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక మీడియా ప్రతినిధి ఇదే ప్రశ్న ఆమెను అడిగినప్పుడు, ఆమె స్పష్టంగా సమాధానం చెప్పకుండా దాటవేయడం ఈ ఊహాగానాలను బలపరుస్తునట్లుంది. 

 “నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా పార్టీ నాయకుడు నిర్ణయిస్తారు. అయన ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాను. ఈవిషయంలో నాకు స్వంత అజెండా లేదు. వాస్తవానికి మాపార్టీలో ఎవరికీ స్వంత అజెండా ఉండదు. మా పార్టీ నాయకుడు ఏది నిర్ణయిస్తే అందరూ దానిని తూచా తప్పకుండా పాటిస్తాము.” అని కవిత చెప్పారు.

ఒకవేళ ఆమె మళ్ళీ నిజామాబాద్ నుంచే లోక్ సభకు పోటీ చేయబోతున్నట్లయితే అదేమాట స్పష్టంగా చెప్పి ఉండేవారు. కానీ చెప్పలేదు. అలాగే శాసనసభ, లోక్ సభ దేనికి పోటీ చేస్తారనే ప్రశ్నకు ఆమె సూటిగా సమాధానం చెప్పలేదు. కనుక వచ్చే ఎన్నికలలో ఆమె జగిత్యాల నుంచే శాసనసభకు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


Related Post