భాజపా-తెరాసల మద్య అనుబందానికి ఇదే నిదర్శనం?

July 18, 2018


img

రాష్ట్ర స్థాయిలో తెరాస-భాజపాలు రాజకీయ శత్రువులుగా వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో వాటి మద్య అద్భుతమైన అవగాహన, సమన్వయం కలిగి ఉన్నాయి. అవసరమైనప్పుడు ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. పొత్తులు పెట్టుకొని నాలుగేళ్ళపాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగిన తెదేపా-భాజపాల మధ్య కూడా ఇంతటి సఖ్యత ఏనాడూ కనిపించలేదు. తెలంగాణా రాష్ట్ర స్థాయిలో తెరాస-భాజపాల మద్య రాజకీయ విభేదాలు కూడా కేంద్రరాష్ట్రప్రభుత్వాల మద్య సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. 

కేంద్రంతో తెరాస సర్కార్ బంధం నేటికీ అంతే దృడంగా ఉందని నిరూపిస్తున్నట్లు, మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా బుధవారం తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెరాస మద్దతు ఈయలేదు. ఒక రాజకీయ పార్టీ మరొకపార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తప్పనిసరిగా మద్దతు ఈయాలనే నిబంధన ఏమీ లేనప్పటికీ, కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని గొప్పలు చెప్పుకొని, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి హడావుడి చేసిన కెసిఆర్, తన చిత్తశుద్ధిని నిరూపించుకొనేందుకు అవకాశం వచ్చినప్పుడు మోడీ సర్కార్ ను వ్యతిరేకించడానికి తాను వెనుకాడనని నిరూపించుకొని ఉంటే బాగుండేది. కానీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం వలన మోడీ-కెసిఆర్ మద్య రహస్య అవగాహన ఉందనే ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూర్చినట్లయింది. 

మోడీ సర్కార్ కు కష్టకాలంలో అండగా నిలబడుతూ, మళ్ళీ భాజపాకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ఒకవేళ కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేయకుంటే నేడు ఎవరూ తెరాసను ఈవిధంగా వేలెత్తిచూపగలిగేవారు కాదు. 


Related Post