అవిశ్వాసానికి మోడీ సర్కార్ సై

July 18, 2018


img

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు అంగీకరించకుండా కుంటిసాకులతో తప్పించుకొన్న మోడీ సర్కార్ ఈసారి పార్లమెంటు సమావేశాల మొదటిరోజునే తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించడం విశేషం. తెదేపా ఎంపి కేశినేని నాని ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి తెదేపాతో సహా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమాద్మీ, ఆర్.జెడి, ఎస్పి, ఆర్.ఎస్.పి.,ఎన్.సి.పి, పార్టీలకు చెందిన 50 మంది సభ్యులు మద్దతు పలికారు. తెరాస మద్దతు ఈయలేదు. తమ అధినేత కెసిఆర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రానందున మద్దతు పలకడంలేదని వారు చెప్పారు. 

ఈ తీర్మానంపై 10 రోజులలోపు సభలో చర్చకు సమయం కేటాయిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. అయితే దీనిపై ఎంత ఆలస్యం చేస్తే ప్రతిపక్షాలు ఏకం అయ్యేందుకు అంత అవకాశం కల్పించినట్లవుతుంది. పైగా దీనిపై ఆలోచించుకోవడానికి తెదేపాకు ఎక్కువ సమయం ఇచ్చినట్లవుతుంది. కనుక బహుశః రెండు మూడు రోజులలోపే దీనిపై సభలో చర్చకు అనుమతించవచ్చు. 

అయితే భాజపా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి లోక్ సభలో 320 మంది సభ్యులు ఉన్నందున, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి ఓటేసినా వచ్చే నష్టం ఏమీ ఉండదు. ప్రభుత్వం పడిపోదు. కానీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం పట్ల ఇటువంటి వ్యతిరేకధోరణి ఉందని చాటింపు వేసుకొన్నట్లవుతుంది కనుక వీలైనంత వేగంగా, క్లుప్తంగా ఈ తంతును పూర్తి చేసేయడానికి మోడీ సర్కార్ ప్రయత్నించవచ్చు. 


Related Post