డిఎస్ కధ క్లైమాక్స్ చేరడానికి కారణం ఏమిటి?

July 18, 2018


img

తెరాస రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై తెరాస నిజామాబాద్ ఎంపి కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి అవమానకర పరిస్థితులలో బయటకువచ్చి తెరాసలో చేరిన అయనను నెత్తిన పెట్టుకొంటే అయన తెరాసకు వెన్నుపోటు పొడిచారని ఆమె ఆరోపించారు. అయితే తెరాసలో సముచితగౌరవం లభించినప్పటికీ డి.శ్రీనివాస్ ఎందుకు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు? వాటివలన ఆయనకు నష్టమే తప్ప లాభం ఉండదు కదా?అసలు ఆయనకు ఆ అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే కొన్ని సమాధానాలు కనిపిస్తాయి. 

కాంగ్రెస్, తెదేపాల నుంచి తెరాసలో చేరినవారికి, మొదటి నుంచి తెరాసలో ఉన్నవారికీ మద్య గొప్ప సంబంధాలు లేవనే విషయం బహిరంగ రహస్యం. మంత్రుల స్థాయిలో బాగానే ఉందేమో కానీ జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల మద్య వారి అనుచరుల మద్య విభేదాలు నెలకొని ఉండటం సహజం. ఇది ఒక కారణమని డి.శ్రీనివాస్ అనుచరులు చెపుతున్న మాట!

ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జిల్లాలో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన డి.శ్రీనివాస్, తెరాసలో చేరిన తరువాత కూడ చక్రం తిప్పాలనుకోవడం కూడా సహజమే. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి కుమార్తె కవిత కనుసన్నలలో జిల్లా రాజకీయాలు నడుస్తున్నప్పుడు మద్యలో వచ్చిన డి.శ్రీనివాస్ అటువంటి ప్రయత్నాలు చేస్తే అది బెడిసికొడుతుందని ఎవరైనా చెప్పగలరు. చివరికి అదే జరిగింది కూడా. తెరాసలో తన స్థానం సుస్థిరం చేసుకొనేందుకు అయన చేసిన ప్రయత్నాలు వికటించడం మరో కారణంగా కనిపిస్తోంది.

ఇక అయన కుమారుడు అరవింద్ భాజపాలో చేరడం, తెరాసకు సవాళ్ళు విసురుతుండటం అయినా డిఎస్ తన కుమారుడిని వారించకపోవడం తెరాసకు ఆగ్రహం కలిగించడం సహజం. ఇది మరో కారణం. 

ఇక ఆశించినట్లుగా తెరాసలో సముచిత గౌరవం లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న డి.శ్రీనివాస్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే అందులో విచిత్రమేమీ లేదు. అదే ఆయనపై పిర్యాదుకు అవకాశం కల్పించింది. కనుక కర్ణుడు చావుకు వెయ్యి శాపాలు అన్నట్లు, తెరాసలో డి.శ్రీనివాస్ కధ ఇంత త్వరగా క్లైమాక్స్ చేరుకోవడానికి కూడ ఇన్ని కారణాలు కనిపిస్తున్నాయి.


Related Post