ఎన్ని వినతిపత్రాలు ఇస్తే మాత్రం ఏమి లాభం?

July 11, 2018


img

బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్, తెలంగాణా జనసమితి, తెదేపా, వామపక్షాల నేతలు గవర్నర్ నరసింహన్ కు బుధవారం వినతిపత్రం ఇచ్చి వచ్చారు. అనంతరం కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీని చూసి సిఎం కెసిఆర్ భయపడుతున్నందునే బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి పట్టుబట్టడం లేదని ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధించేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యపోరాటాలు మొదలుపెడతామని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ రంగంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 

ఉక్కు కర్మాగారం విషయంలో తెరాస సర్కార్ చేయదగ్గ అన్ని ప్రయత్నాలు చేసిందని అందరికీ తెలుసు. కానీ కేంద్రప్రభుత్వమే కమిటీలు వేసి అధ్యయనం పేరుతో తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు నాలుగేళ్ళు ఆలోచించి ఉండేదే కాదు. కారణాలు ఏవైతేనేమి, కేంద్రానికి అక్కడ ఉక్కు కర్మాగారం నిర్మించే ఉద్దేశ్యం లేదని స్పష్టం అవుతోంది. కేంద్రం హ్యాండ్ ఇచ్చిందని గ్రహించినందునే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సిద్దం అవుతోంది. 

దీనికోసం గవర్నర్ కు వినతిపత్రాలు ఇవ్వడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదని తెలిసి ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు వెళ్లి ఆయన చేతిలో కాగితంముక్క పెట్టి వచ్చాయి. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తుంటే, ఒక ప్రయోజనం లేని పని చేసి వచ్చిన ప్రతిపక్షాలు దీని నుంచి రాజకీయమైలేజీ పొందాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినట్లు భావించవచ్చు. 


Related Post