కాంగ్రెస్ పార్టీ కూడా నో చెప్పేసింది

July 11, 2018


img

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే కేంద్రం ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కూడా తేల్చి చెప్పేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ బుధవారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్దమైనవి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవి. కనుక ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది,” అని చెప్పారు.

జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కనుక దాని మిత్రపక్షాలు కూడా వ్యతిరేకిస్తాయి. ఒకవేళ ఈవిషయంలో కేంద్రం మొండిగా ముందుకు సాగాలనుకుంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం ఖాయం. ఇక ఆమాద్మీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె వంటి మరికొన్ని పార్టీలు ఇప్పటికే జమిలికి ‘నో’ చెప్పాయి కనుక అవి కూడా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేంద్రం ప్రయత్నాలను అడ్డుకోవచ్చు. భాజపాతో తెగతెంపులు చేసుకొని తెదేపా కూడా మోడీ సర్కార్ తో యుద్ధం చేస్తోంది కనుక అది జమిలి ఎన్నికలకు ముందే ‘నో’ చెప్పేసింది. కనుక ఈవిషయంలో మోడీ సర్కార్ ప్రయత్నాలను అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు కూడా గట్టి ప్రయత్నాలే చేయవచ్చు. ఈ పరిస్థితులలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. 

ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే ఈ విషయంలో తెరాస తొందరపాటు పడినట్లవుతుంది. తెరాస కేవలం జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మాత్రమే మద్దతు తెలిపినప్పటికీ అది మోడీ సర్కార్ కు మద్దతు తెలిపినట్లుగా ప్రతిపక్షాలు అభివర్ణించవచ్చు.

జమిలి ఎన్నికల విషయంలో నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ప్రకటించలేదు కనుక మౌనంగా ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీ వైఖరి వెల్లడయింది కనుక ఇక నుంచి ఈ అంశంపై తెరాసను విమర్శించడం మొదలుపెట్టవచ్చు. కెసిఆర్-మోడీల మద్య రహస్య అవగాహన ఉందని చెప్పడానికి ఇదే మంచి నిదర్శనమని తెరాసను వేలెత్తి చూపకమానరు. 


Related Post