హైకోర్టులో ప్రభుత్వానికి మళ్ళీ మొట్టికాయలు

July 11, 2018


img

తెరాస సర్కార్ కు హైకోర్టులో అనేకమార్లు మొట్టికాయలు పడ్డాయి. ఇంకా పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వపరంగా నిర్ణయాలు తీసుకొనేటపుడు, అవి న్యాయస్థానాలలో నిలుస్తాయా లేదా? అనే కోణంలో నుంచి కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే హైకోర్టు చేత పదేపదే మొట్టికాయలు వేయించుకొనే బాధ తప్పేది. కానీ తొందరపాటు నిర్ణయాల కారణంగా నాలుగేళ్ళు గడిచినా నేటికీ ఈ సమస్య పునరావృతం అవుతూనే ఉంది. తాజాగా 550 మంది తెలంగాణా సాంస్కృతిక సారధులు నియామక వ్యవహారంలో ప్రభుత్వానికి మళ్ళీ హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి.

ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా ప్రభుత్వం తనకు నచ్చినవారికి ఉద్యోగాలు కల్పించడం వలన అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, కనుక వారి నియామకాలు రద్దు చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన జె.రమేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం దానిపై మంగళవారం విచారణ జరిపి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది. వారి నియామకాలకు మూడు వారాలలోగా నోటిఫికేషన్ జారీ చేసి, మూడు నెలలోగా ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అంతవరకు 550 మందిని ఆ ఉద్యోగాలలో కొనసాగించుకోవడానికి హైకోర్టు అనుమతిచ్చింది.  

హైకోర్టు తీర్పుపై సాంస్కృతిక సారథి చైర్మన్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ స్పందిస్తూ, “హైకోర్టు తీర్పు చూసి సాంస్కృతిక సారధులు ఆందోళన చెందనవసరం లేదు. దీనిపై సాంస్కృతిక కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటాము. వారి ఉద్యోగాలకు డోకా ఉండదని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

నోటిఫికేషన్ జారీ చేయకుండా 550 మందిని నియమించుకొన్నందున అర్హులకు అన్యాయం జరుగుతోందనే పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది కనుకనే ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి ‘అర్హులను’ ఎంపిక చేసుకోమని ఆదేశించింది. నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం నియమించుకొన్న ఆ 550 మంది కూడా ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వాటికోసం కొత్తగా దరఖాస్తు చేసుకొనేవారితో పోటీపడి అర్హత సాధించవలసి ఉంటుంది. 

ఆ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి అర్హులను నియమించుకోవలసిందిగా హైకోర్టు ఆదేశిస్తే, ఇదివరకు నియమింపబడినవారి ఉద్యోగాలకు డోకా లేదని రసమయి బాలకిషన్‌ చెప్పడం కోర్టు తీర్పును అపహాస్యం చేసినట్లే అవుతుంది.


Related Post