డిఎస్ మాకు అవసరం లేదు: విహెచ్

July 10, 2018


img

తెరాస ఎంపి డి.శ్రీనివాస్ ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగాలో వద్దో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ తెరాస నుంచి బయటకు రావలసివస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయన ఆ ఉద్దేశ్యంతో ఉన్నందునే ఆయనపై బహిష్కరణవేటు వేయాలని నిజామాబాద్ జిల్లా తెరాస నేతలు సిఎం కెసిఆర్ కు పిర్యాదు చేశారు. డిఎస్ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

“కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన డిఎస్, పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పదవుల కోసం తెరాసలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెరాసలో ఇమడలేని పరిస్థితులు ఏర్పడగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయడానికి సిద్దపడుతున్నారు. ఒకవేళ సిఎం కెసిఆర్ భుజం చెయ్యేసి ‘ఏంది శీనన్నా’ అని పలకరిస్తే మళ్ళీ కెసిఆర్ భజన చేయడానికి వెనుకాడరు. ఇటువంటి అవకాశవాద రాజకీయనాయకులు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. కనుక అయనను పార్టీలో చేర్చుకొనే విషయంలో కాంగ్రెస్ కమిటీ నేతలు పునరాలోచించుకుంటే మంచిది. ఈ విషయంలో పార్టీలో అందరి అభిప్రాయలు తీసుకొంటే మంచిది,” అని అన్నారు. 

తనకు కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భావిస్తున్న డి.శ్రీనివాస్ కు వి.హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చేవే. ఒకవేళ డి.శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసివస్తుంది. అప్పుడు కొడుకుతో పాటు భాజపాలో చేరవలసివస్తుంది. ఈ వయసులో పార్టీలు మారి ఉన్న పరువు పోగొట్టుకోవడం కంటే రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకొంటే మంచిదేమో కదా?


Related Post