తెరాసలో అవిశ్వాస సెగలు

July 10, 2018


img

ఇల్లలకగానే పండుగ కాదన్నట్లు ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోగానే ‘ఆల్ ఈజ్ వెల్’ అనుకోలేమని తెరాసలో మొదలైన అవిశ్వాస సెగలు నిరూపిస్తున్నాయి. తెరాస చేతిలో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమవారిపైనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. అందుకు ప్రధానకారణం తెరాసలో పాత, కొత్త నేతలమధ్య నేటికీ సఖ్యత కుదరకపోవడమేనని చెప్పవచ్చు. అందుకే నాలుగేళ్ళు పూర్తవగానే అధిష్టానం వారిస్తున్నా వినకుండా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేస్తున్నారు. 

రామగుండం కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవద్దని తెరాస అధిష్టానం గట్టిగా హెచ్చరించినప్పటికీ, తెరాస కార్పొరేటర్లు పట్టించుకోకుండా ప్రతిపక్ష సభ్యుల మద్దతు తీసుకొని కలెక్టరుకు అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేశారు. అటు కార్పోరేటర్లకు నచ్చచెప్పలేక, ఇటు అధిష్టానం ఆదేశాలను పాటించలేకపోతునందున రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నానని ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రకటించడం గమనిస్తే పార్టీలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

తాజాగా వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల పురపాలక చైర్మన్ రాజభద్రయ్య ఇదే కారణంతో తెరాసకు గుడ్-బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూలై 26వ తేదీన అయన బలనిరూపణ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఇక వేములవాడ, బెల్లంపల్లి, భువనగిరి, సదాశివపేట పురపాలక సంఘాలలో కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మహబూబాబాద్, కోదాడ, వికారాబాద్ లలో ఇదేరకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ అవిశ్వాస తీర్మానాలు పదవుల కోసం యావతో ప్రవేశపెడుతున్నవే కావచ్చు కానీ అవి తెరాస నేతల మధ్య నెలకొనున్న అంతర్గత విభేదాలు, అనైఖ్యతను బయటపెడుతున్నాయి. మరి ముందస్తు లేదా జమిలి ఎన్నికలోస్తే తెరాసలో పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో? 


Related Post