సంపత్ కుమార్ కు ప్రమోషన్

June 23, 2018


img

టి-కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు ఊహించనివిధంగా పార్టీలో ప్రమోషన్ లభించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనను మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కమిటీలో కార్యదర్శిగా నియమించారు. 

మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా ఎంపి మల్లిఖార్జున ఖర్గేను నియమించారు. కాంగ్రెస్ పార్టీలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా త్వరలో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు సమాచారం. దానిలో తెలంగాణా నుంచి జైపాల్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఎంపి మల్లిఖార్జున ఖర్గే తన స్వరాష్ట్రమైన కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటుండేవారు. ఇటీవల కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో కూడా అయన మళ్ళీ తన మనసులో ఆ కోరికను బయటపెట్టారు. కానీ కర్ణాటకలో ఏమి జరిగిందో అందరూ చూశారు. మల్లిఖార్జున ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి అవుదామని ఆశపడితే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించబడటం విశేషం. మహారాష్ట్రలో శివసేన, భాజపాలకు మంచి పట్టుంది కనుక ఆయనకు ఈ పదవి ఒక అగ్నిపరీక్ష వంటిదేనని చెప్పవచ్చు.

ఇక శాసనసభ్యత్వం రద్దుతో అందరి దృష్టిలో పడిన ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు అదే అదృష్టంగా మారిందని ఈ నియామకం నిరూపిస్తోంది. అయన టి-పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తే అనూహ్యంగా ఈ పదవి లభించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పదేపదే సవాలు విసురుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కట్టడి చేసేందుకే, బహుశః రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో ఎవరో సంపత్ కుమార్ పేరును అధిష్టానానికి గట్టిగా రికమండ్ చేసి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఇటువంటి కీలకమైన పదవి లభించినప్పుడు, దానిని తెలివిగా సద్వినియోగం చేసుకోగలిగితే పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సంపత్ కుమార్ కు అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 


Related Post