కాంగ్రెస్ వాదనకు లష్కరే మద్దతు!

June 22, 2018


img

కాంగ్రెస్ పార్టీకి ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా మద్దతు పలకడం ఏమిటని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజమే. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించి, మిలటరీ ఆపరేషన్లకు కేంద్రం సిద్దం అవుతుండటంపై మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ, “జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్మీ చేపడుతున్న మిలటరీ ఆపరేషన్స్ లో ఉగ్రవాదుల కంటే సామాన్య ప్రజలే ఎక్కువమంది చనిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ‘ఆలౌట్ ఆపరేషన్’ పేరిట చేపట్టబోతున్న మిలటరీ ఆపరేషన్ జమ్ము కాశ్మీర్ రాష్ట్ర చరిత్రలో మరొక మహా నరమేధంగా నిలిచిపోబోతోంది. ఉగ్రవాదులను ఏరివేయడం కోసం సామాన్య ప్రజలను చంపడం చాలా దారుణం,” అని అన్నారు. 

గులాం నబీ ఆజాద్ చేసిన ఈ వ్యాఖ్యలపై కరడుగట్టిన ఉగ్రవాదసంస్థ లష్కరే తయిబా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఉగ్రవాద సంస్థ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఘజ్నవీ మీడియా సంస్థలకు పంపిన ఒక ఈ మెయిల్ సందేశంలో “కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలతో మేము కూడా ఏకీభవిస్తున్నాము. పుల్వామాలో ఒక ఉగ్రవాదిని చంపడానికి భారత ఆర్మీ దళాలు 13 మంది సామాన్య పౌరులను పొట్టన పెట్టుకున్నాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్.ఎస్.ఎస్. అజెండాను అమలుచేయడానికి మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అన్నివిధాల కేంద్రానికి సహకరించారు. ఇప్పుడు జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన విధించి ‘ఆలౌట్ ఆపరేషన్’ మొదలుపెట్టడం అంటే అమాయకులైన కాశ్మీరీ ప్రజలను తుడిచిపెట్టేయడానికేనని మేము భావిస్తున్నాము,” అని వ్రాశారు. 

గులాం నబీ ఆజాద్ జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికే చెందిన వ్యక్తి, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నవారు కనుక ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి బాగా తెలిసి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో వేర్పాటువాదుల, ఉగ్రవాదుల దాడులు, యువతపై వారి ప్రభావం గురించి కూడా బాగా తెలిసే ఉంటుంది. కనుక అయన ఒక కాంగ్రెస్ నేతలాగ మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించే బదులు, ఆ రాష్ట్రానికి చెందిన నేతగా జమ్ము కాశ్మీర్ లో శాంతి నెలకొల్పడానికి తగిన సలహాలు, సూచనలు చేస్తే బాగుండేది. కానీ కాంగ్రెస్ కోణంలో నుంచి అయన చేసిన వ్యాఖ్యలు లష్కరే తయిబా వంటి ఉగ్రవాదసంస్థ వాదనలకు బలం చేకూర్చేదిగా ఉండటం శోచనీయం.


Related Post