రాహుల్ గాంధీ ప్రధాని కాగలరా?

June 19, 2018


img

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 48వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. “ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకొంటున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు,” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.  

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా అయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలలో 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ దేశప్రధాని కావాలని ఆకాంక్షించారు. వారు ఆ విధంగా కోరుకోవడం సహజమే. 

అయితే, వచ్చే ఎన్నికలలో భాజపాను ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రాంతీయ పార్టీలతో ఎన్నికల పొత్తులు, వాటి మద్దతు చాలా అవసరం అని కాంగ్రెస్ అధిష్టానం గ్రహించింది. అందుకే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 250 లోక్ సభ స్థానాలలో మాత్రమే పోటీ చేసి మిగిలినవాటిని ప్రాంతీయ పార్టీలకు విడిచిపెట్టేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ వ్యూహంతోనే వచ్చే ఎన్నికలలో భాజపాను ఓడించడం సాధ్యమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకునే పార్టీలు లేదా దానితో కలిసి పనిచేయాలనుకుంటున్న పార్టీలు, ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలని కోరుకుంటే ఆశ్చర్యం లేదు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ అధికారం చేజారిపోకుండా కాపాడుకొనేందుకు తనకంటే తక్కువ సీట్లు సాధించిన  జెడిఎస్ కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించవలసి వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడితే ప్రధానమంత్రి పదవిని వాటికి అప్పగించవలసి రావచ్చు. ఒకవేళ ప్రాంతీయపార్టీలతో పొత్తులు వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి లభిస్తుందనే నమ్మకం లేదు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులను ఇప్పుడే ఊహించడం తొందరపాటే అవుతుంది. కనుక ఎన్నికలు దగ్గరపడితే కానీ రాహుల్ గాంధీ భవిష్యత్ పై స్పష్టత రాదు.


Related Post