వాటి గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదు?

June 18, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ మొన్న ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి, విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు గురించి గట్టిగా నిలదీయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలనీ కోరడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పు పట్టారు. నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా అయన తన ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారని విమర్శించారు. సిఎం కెసిఆర్ ను ప్రశ్నిస్తూ అయన ఒక బహిరంగలేఖ వ్రాశారు. 

విభజన చట్టంలో రాష్ట్రానికి అనేక హామీలు ఇవ్వబడ్డాయి. వాటిలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఐటిఐఆర్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు మొదలైనవి ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైనప్పుడు వాటి గురించి నిలదీయలేదు. అలాగే గిరిజనులు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. దాని గురించి ప్రధానిమోడీపై ఒత్తిడి తేలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తే చాలన్నట్లు సిఎం కెసిఆర్ మాట్లాడటం దురదృష్టకరం. రాష్ట్రానికి రావలసినవాటిని అన్నిటినీ గాలికొదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు సాధిస్తే సరిపోతుందా?” అని ప్రశ్నించారు. 

ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్ సమావేశమైనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20,000 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరిన విషయం మీడియాలో ప్రధానంగా హైలైట్ అయిన మాట వాస్తవం. కానీ అంతమాత్రన్న సిఎం కెసిఆర్ రాష్ట్రానికి సంబందించిన ఇతర సమస్యలను, హామీల అమలు గురించి ప్రధాని నరేంద్రమోడీని అడగలేదనుకోలేము. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కాంగ్రెస్ ప్రతినిధి సిఎం కెసిఆర్ పై విమర్శలు గుప్పించడం, బహిరంగలేఖ వ్రాయడం హాస్యాస్పదంగా ఉంది. 


Related Post