ఆర్టీసిలో మళ్ళీ హడావుడి?

June 18, 2018


img

వేతన సవరణ కోరుతూ ఆర్టీసి గుర్తింపు సంఘం టి.ఎం.యు. ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం, అప్పుడు ప్రభుత్వం 16 శాతం తాత్కాలికభృతి ఇవ్వడానికి అంగీకరించడంతో సమ్మె విరమణ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆర్టీసిలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (టిఎస్ ఎస్.డబ్ల్యూ.ఎఫ్) మళ్ళీ అందోళనలకు పిలుపునివ్వడం విశేషం. ఆర్టీసి పరిరక్షణ కోసం ఈనెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆర్టీసి కార్మికులకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం టిఎస్ ఎస్.డబ్ల్యూ.ఎఫ్. రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది.

దాని అధ్యక్షుడు సిహెచ్ రాంచందర్, ప్రధానకార్యదర్శి వి.ఎస్.రావు ఈ సందర్భంగా ఆర్టీసి కార్మికులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిపిఎం నేతృత్వంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయవ్యవస్థగా ఆవిర్భవించిన బిఎల్ఎఫ్ వివిధ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25,26,27 ఎదీలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్టీసి పరిరక్షణ కోసం ఆర్టీసి కార్మికులు కూడా ఆ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలునిస్తున్నాం. ఒకపక్క ఆర్టీసిని మూసివేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, దానిని ధీటుగా ఎదుర్కోవలసిన ఆర్టీసి గుర్తింపు సంఘం ప్రభుత్వానికి లొంగిపోవడంతో ఆర్టీసి భవిష్యత్ కు ప్రమాదకరంగా మారింది. కనుక ఆర్టీసి కార్మికులు అందరూ 27వ తేదీన జరిగే ఆందోళన కార్యక్రమాలలో పాల్గొని ఆర్టీసి పరిరక్షణకు కృషి చేయాలి. వీటితో సహా భవిష్యత్ లో ఎస్.డబ్ల్యూ.ఎఫ్. అధ్వర్యంలో చేపట్టబోయే అన్ని ఆందోళన కార్యక్రమాలకు గుర్తింపు యూనియన్ టి.ఎం.యు సహకరిస్తుందని ఆశిస్తున్నాము,” అని అన్నారు. 

ఎస్.డబ్ల్యూ.ఎఫ్. నేతల మాటలనుబట్టి చూస్తే వారు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్)కు అనుబందంగా పనిచేయాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆర్టీసి కార్మికులు అందుకు అంగీకరిస్తారా లేదా? దాని మాట మన్నించి బిఎల్ఎఫ్ నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటారా లేదా? పాల్గొనే మాటయితే గుర్తింపు సంఘం టి.ఎం.యు., రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.


Related Post