జమిలి ఎన్నికల గురించి జరా సోచియే: మోడీ

June 18, 2018


img

ఆదివారం డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ శాసనసభ, లోక్ సభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించగలిగితే ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఎక్కువ కాలం పరిపాలనపై దృష్టి కేంద్రీకరించగలుగుతాయని అన్నారు. కనుక ముఖ్యమంత్రులు అందరూ జమిలి ఎన్నికల గురించి ఆలోచించవలసిందిగాకోరారు.

ఈ ఏడాదిలో భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉంది. ఇక వచ్చే ఏడాది అంటే 2019లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హరియాణ, ఓడిశా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగవలసి ఉంది. కనుక ఆయా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లయితే ఈ ఏడాది చివరిలోనే అన్నిటికీ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. 

ఈ ఆలోచన బాగానే ఉంది కానీ ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు మోడీ సర్కార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఏపి (తెదేపా), తెలంగాణా (తెరాస), కర్ణాటక (జెడిఎస్), కేరళ (అధికార, ప్రతిపక్షాలు రెండూ), తమిళనాడు (డిఎంకె) మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నాయి. అలాగే మహారాష్ట్రలో శివసేన, ఓడిశాలో అధికార బిజెడి, అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కార్ పై కత్తులు నూరుతున్నాయి. 

పైగా ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు పూర్తి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే అవి ముందస్తు ఎన్నికలకు అంగీకరిస్తాయి. లేకుంటే షెడ్యూల్ ప్రకారం 2019లోనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుపట్టడం ఖాయం. కనుక మోడీ సర్కార్ చేస్తున్న ఈ జమిలి ప్రతిపాదనకు భాజపాయేతర పార్టీలు అంగీకరిస్తాయని ఆశించలేము. 


Related Post