రాహుల్ ను తక్కువగా అంచనా వేస్తే...

June 13, 2018


img

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిత్యం ఏదో ఒక సాకుతో ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తుండటం అందరూ చూస్తున్నదే. అందుకు ప్రతిగా భాజపా నేతలు రాహుల్ గాంధీని చంటి పిల్లాడని, చాక్లెట్ బాయ్, అపరిపక్వ రాజకీయనేత అని రకరకాల పేర్లతో ఎద్దేవా చేస్తుంటారు.      

అయితే మునుపటితో పోలిస్తే రాహుల్ గాంధీలో చాలా రాజకీయ పరిణతి కనిపిస్తోంది. అయన ఇప్పుడు చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని చాలా హుషారుగా నడిపిస్తున్నారు. అందుకు ఉదాహరణగా గుజరాత్, కర్ణాటక శాసనసభ ఎన్నికలను చెప్పుకోవచ్చు. 

భాజపాకు కంచుకోట వంటి గుజరాత్ రాష్ట్రంలో చకచకా నిర్ణయాలు తీసుకొని, భాజపాకు చావు తప్పి కన్నులొట్టపోయేట్లుచేశారు. గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన కొన్ని చిన్నచిన్న తప్పిదాల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది లేకుంటే గుజరాత్ లో అదే గెలిచి ఉండేది. 

ఆ లోపాలను సవరించుకొని కర్ణాటక ఎన్నికలలో మళ్ళీ గెలిచేందుకు రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ సిద్దరామయ్య పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకత వల్లనైతేనేమీ, ఎడ్యూరప్ప శక్తియుక్తులవల్లనైతేనేమి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ రాహుల్ గాంధీ మళ్ళీ చాకచక్యంగా వ్యవహరించి దేవగౌడ, కుమారస్వామిలను ప్రసన్నం చేసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో భాగస్వామిగా చేయగలిగారు. 

గుజరాత్, కర్ణాటకలలో నేర్చుకున్న ఈ సరికొత్త రాజకీయపాఠాలతో రాహుల్ గాంధీ మరింత రాటుదేలారని చెప్పవచ్చు. ఆయనలో ఇప్పుడు సరికొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో భాజపాను మట్టి కరిపించి తన సత్తా చాటుకోవాలని రాహుల్ గాంధీ చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. 

ఇదే ఊపులో దేశంలో భాజపాను వ్యతిరేకిస్తున్న అన్నిపార్టీలను, వర్గాలను, శక్తులను కలుపుకుపోవడానికి ప్రయత్నాలు ముమ్మురం చేశారు. ఉదాహరణకు ఇటీవల హన్మకొండలో ఎం.ఆర్.పి.ఎస్. అధ్వర్యంలో జరిగిన దళితుల ‘సింహగర్జన’ సభకు మాజీ స్పీకర్ మీరా కుమార్, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్ఘేను పంపించడాన్ని చెప్పుకోవచ్చు. అది చూసి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ కలవరపడ్డారు కూడా. ఈవిధంగా రాహుల్ గాంధీ 2019 ఎన్నికలకు పార్టీని సర్వసన్నధం చేస్తున్నారని చెప్పవచ్చు.

కనుక 2014 ఎన్నికలలో కనబడిన రాహుల్ గాంధీకి, 2019 ఎన్నికలలో కనబడబోతున్న రాహుల్ గాంధీకి చాలాతేడా ఉంటుందని చెప్పవచ్చు. కనుక ఆయనను తక్కువగా అంచనా వేసుకొంటే నష్టపోయేది భాజపాయే. ఈ విషయాన్ని భాజపా గుజరాత్ లోనే గ్రహించింది కానీ గ్రహించనట్లు నటిస్తూ కర్ణాటకలో ఆయనను ఎదుర్కోవడానికి మరింత పదునైన వ్యూహాలు రచించడం అందరూ చూశారు. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధీ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలలో అయన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలరా లేదా అనేది అప్పుడే తేలుతుంది. కానీ భాజపా ఇప్పుడే మేల్కోవడం మంచిది.


Related Post