టి-కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?

June 13, 2018


img

వర్తమాన రాజకీయాలలో అబద్దాలను కూడా నిజమని గట్టిగా ప్రచారం చేసుకొని జనాలను నమ్మించడానికి మన రాజకీయనాయకులు సందేహించడం లేదని అందరికీ తెలుసు. ఒక పార్టీని మరొకటి రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఈ ట్రిక్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. ఉదాహరణకు తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ అప్రదిష్టపాలు చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాంను ఎదుర్కోవడానికి తెరాస ఆయనపై కాంగ్రెస్ ఏజంట్ అనే ముద్రవేసి గట్టిగా ప్రచారం చేసింది. ఆయన కాంగ్రెస్ నేతలతో చనువుగా తిరుగుతుంటారు కనుక తెరాస వాదనకు బలం చేకూరినట్లయింది. ఆ కారణంగా అయన స్థాపించిన తెలంగాణా జనసమితి (టిజెఎస్)కి ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన లభించలేదని చెప్పవచ్చు. 

తెలంగాణా కాంగ్రెస్ కూడా తెరాసపై అటువంటి ప్రచారఆయుధంతోనే దాడి చేస్తోంది ఇప్పుడు. మంగళవారం నాంపల్లి వద్ద గల రెడ్ రోస్ ఫంక్షన్ హాల్ లో టి-కాంగ్రెస్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసింది. ఆ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నలలో పనిచేస్తున్నారు. నోట్లరద్దు, జి.ఎస్.టి., ఉపరాష్ట్రపతి ఎన్నిక తదితర అంశాలలో కెసిఆర్ మోడీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కెసిఆర్ కు ప్రతీ విషయంలో అసదుద్దీన్ ఒవైసీ మద్దతు పలుకుతుంటారు. అంటే వారిద్దరూ ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నలలో పనిచేస్తున్నారని స్పష్టం అవుతోంది. కనుక 2019 ఎన్నికలలో తెరాస, మజ్లీస్ పార్టీలకు ఓట్లేస్తే భాజపాకు, మోడీ సర్కార్ కు ఓటేసినట్లే అవుతుంది. 

ముస్లింల సంక్షేమం కోసం మోడీ చేసిందేమీ లేదు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయి. వారు అణచివేతకు గురవుతున్నారు. అటువంటి మోడీ సర్కార్ కు కెసిఆర్ మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని గొప్పలు చెప్పుకున్న కెసిఆర్ ఏమి చేశారు? అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీకి పంపించి చేతులు దులుపుకున్నారు. అక్కడ మోడీ దానిని పక్కన పడేశారు. అంటే ఇద్దరూ కలిసి ముస్లింలను మభ్యపెడుతున్నారని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎల్లప్పుడూ ముస్లింల సంక్షేమం కోసం కృషి చేసింది. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకె ఓటేసి తెరాస, భాజపాలకు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్న ఈ మాటలనే టి-కాంగ్రెస్ నేతలలో చాలామంది ఇదే వాదనను బలంగా వినిపిస్తున్నారు. అంటే ఇది వచ్చే ఎన్నికలలో తెరాస, మజ్లీస్ పార్టీలను డ్డీ కొనడానికి రూపొందించిన వ్యూహంగా కనిపిస్తోంది. కానీ వారి వ్యూహం ఫలిస్తుందా లేదా చూడాలి. 


Related Post