అందరూ కలిసి పాలమూరును తెరాసకు అప్పగిస్తారేమో?

June 12, 2018


img

తెలంగాణా ఏర్పడిన కొత్తలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉన్నప్పుడు జరిగిన 2014 ఎన్నికలలో తెరాస ధాటిని తట్టుకొని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అప్పటి నుంచి  రెండు మూడు నెలల క్రితం వరకు కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. అందుకే వచ్చే ఎన్నికలలో మహబూబ్ నగర్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకొంటుందని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడటం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. 

భాజపాలో నుంచి నాగం జనార్ధన్ రెడ్డి, తెరాసలో నుంచి శివకుమార్ రెడ్డి రాకతో డికె అరుణ, జైపాల్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నాగం రాకను డికె అరుణ వ్యతిరేకించగా, శివకుమార్ రెడ్డి రాకను జైపాల్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. నాగంను జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించగా, శివకుమార్ రెడ్డిని డికె అరుణ రప్పించారు. కనుక ప్రస్తుతం ఆ రెండు వర్గాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. 

ఈ పరిస్థితులలో సోమవారం నారాయణపేటలో కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది. దానిని జైపాల్ రెడ్డి వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. ఆ సమావేశానికి డికె అరుణ డుమ్మా కొట్టారు. ఎందుకో వేరే చెప్పనవసరం లేదు.

వచ్చే నెలలోనే పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని పార్టీలకు తమ సత్తా చాటుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. సరిగ్గా ఈ ఎన్నికలకు ముందు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పరాకాష్టకు చేరుకొంది. జిల్లా కాంగ్రెస్ నేతల మద్య ఈ కీచులాటలు తెరాసకు ఒక వరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ జిల్లా పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పునరావృతం కావచ్చు. కనుక పార్టీలో బలమైన ఈ రెండు వర్గాల నేతల మద్య సఖ్యత, పరస్పర సహకారం చాలా అవసరం. కానీ అది సాధ్యమేనా? రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు దీనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. 


Related Post