ఇప్పుడు తెరాస చేసిందే రేపు మేము చేయగలం: కాంగ్రెస్

June 12, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను తక్షణమే పునరుద్దరించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్ మధుసూధనాచారికి వినతిపత్రం ఇచ్చి వచ్చారు. అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “హైకోర్టు తీర్పు ఇచ్చి 50 రోజులు గడిచినప్పటికీ తెరాస సర్కార్ ఇంతవరకు మా ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించలేదు. తెరాస సర్కార్ కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, కోర్టు తీర్పుల పట్ల గౌరవంలేదని చెప్పేందుకు ఇదే నిదర్శనం. వారం రోజులలోగా మా ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్దరించకపోతే మేము తదుపరి చర్యలు మొదలుపెడతాము. ఇప్పుడు తెరాస సర్కార్ మా ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసినట్లుగానే, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మొదటిరోజునే తెరాస ఎమ్మెల్యేలందరి సభ్యత్వాలు రద్దు చేస్తే ఏమి చేస్తారు?” అని ప్రశ్నించారు. 

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయడాన్ని ఎవరూ సమర్ధించరు. తెరాస సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ మళ్ళీ తాము అధికారంలోకి వచ్చినప్పుడు అదే తప్పు చేయగలమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తామే శాస్వితంగా అధికారంలో ఉండిపోవాలని ప్రతిపక్షాలు ఉండకూడదని కోరుకొంటున్నాయి. అంటే ఎన్నికలులేని రాచరికవ్యవస్థను కోరుకొంటున్నాయని చెప్పవచ్చు. అది భారతదేశంలో సాధ్యంకాదు కనుక అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నాయి. రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం ద్వారా తెరాస తన అధికారాన్ని శాస్వితం చేసుకోవాలనుకుంటే, కర్ణాటకలో తనకంటే తక్కువ ఓట్లు వచ్చిన జెడిఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టి, తన అధికారాన్ని కాపాడుకొంది కాంగ్రెస్ పార్టీ. అంటే అన్ని పార్టీలకు అధికారమే లక్ష్యం అన్నమాట! కనుక నేటి రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశాలున్నాయని భావించవచ్చు.   Related Post