అమిత్ షా మాత్రం ఏం చేయగలరు?

June 12, 2018


img

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జూన్ 22న హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకే అయన హైదరాబాద్ వస్తున్నారని వేరే చెప్పనవసరం లేదు. అయితే తెలంగాణా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు భాజపాకు ఏ మాత్రం అనుకూలంగా లేవని అందరికీ తెలుసు. 

తెరాస రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దానితో వియ్యమా కయ్యమా తేల్చుకోలేని స్థితిలో భాజపా ఉంది. వియ్యానికి అవకాశాలు లేవు కనుక కయ్యానికే సిద్దపడుతోందని భావించవలసి ఉంటుంది. అయితే మోడీ-కెసిఆర్ మద్య రహస్య అవగాహన ఉందనే ఊహాగానాల కారణంగా రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కార్ పై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. 

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో పోటీ ప్రధానంగా తెరాస-కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉండబోతోందని చాలా కాలం క్రితమే స్పష్టం అయ్యింది. వచ్చే ఎన్నికలలో తెరాస ఎట్టిపరిస్థితులలో 100 సీట్లు గెలుచుకొంటుందని లేకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువమంత్రి కేటిఆర్ సవాలు విసురుతున్నారంటే తెరాస ఎంత ఆత్మవిశ్వాసంతో ఉందో గ్రహించవచ్చు. 

ఒకవేళ తెరాస 90 సీట్లు గెలుచుకున్నా మిగిలిన 29 సీట్లలో ఎక్కువ సీట్లను కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు దక్కించుకోవడం ఖాయం. తెదేపా, కొత్తగా ఏర్పాటైన తెలంగాణా జనసమితి (టిజెఎస్), బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) మొదలైనవి కూడా బరిలో ఉన్నాయి. అవెన్ని సీట్లు గెలుచుకుంటాయో ఇప్పుడే చెప్పలేము. కనుక రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఒక పగటికల. తెరాస, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు గెలుచుకోగా మిగిలిన సీట్లలో భాజపా వాటా ఎంత? అనేది ఆ పార్టీ తేల్చుకోగలిగితే చాలు. 

ఒకవేళ వచ్చే ఎన్నికల తరువాత కెసిఆర్ నిజంగానే జాతీయ రాజకీయాలలోకి వెళ్ళదలిస్తే రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలను దక్కించుకోవడం కోసం మరింత గట్టిగా ప్రయత్నించడం తధ్యం. అప్పుడే జాతీయ రాజకీయాలలో అయన మాటకు విలువుంటుంది. అయితే వాటిలో కూడా కొన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొనే అవకాశం ఉంది కనుక ఎంపి సీట్లలో భాజపా వాటా ఎంతో తేల్చుకోవలసి ఉంటుంది. 

ఈ నేపధ్యంలో అమిత్ షా రెండు,మూడు నెలలకోసారి రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్ళినా సాధించేంది ఏముంటుంది? అనే సందేహం కలుగకమానదు.


Related Post