మోడీ ప్రభుత్వానికి నేటితో నాలుగేళ్ళు

May 26, 2018


img

నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నేటితో నాలుగేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ నాలుగేళ్ళలో మోడీ సర్కార్ సాధించిన విజయాలు గురించి క్లుప్తంగా చెప్పుకోవడం సముచితం.

పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్న దేశప్రజలు 2014 ఎన్నికలలో కోటి ఆశలతో నరేంద్ర మోడీకి పట్టం కట్టారు. నాలుగేళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల అంచనాలు, ఆకాంక్షల మేరకు మొదటి నుంచే చాలా దూకుడుగా సాగుతూ పాలనాపరమైన అనేక సంస్కరణలు చేశారు. అనేక కొత్త ఆలోచనలను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులను గెల్చుకున్నారు. 

మోడీ సర్కార్ సాధించిన విజయాలలో తప్పక చెప్పుకోవలసినవి చాలానే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పెండింగులో ఉన్న వివిధ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయిస్తున్నారు. తెలంగాణాలో ప్రాణహిత-చేవెళ్ళ (ఇప్పుడు కాళేశ్వరం), ఏపిలో పోలవరం ప్రాజెక్టు అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.  

దేశవ్యాప్తంగా బారీగా జాతీయ రహదారులు, వంతెనలను నిర్మిస్తున్నారు. దేశంలో మారుమూల గ్రామాలకు రోడ్లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, వివిధ రాష్ట్రాలలో ఉన్నత విద్యా, వైద్యసంస్థల ఏర్పాటు, ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు సన్నాహాలు వంటివి మోడీ సర్కార్ ఆలోచనలు, విజయాలుగానే చెప్పుకోవచ్చు. 

స్వచ్చా భారత్ పధకంలో భాగంగా దేశవ్యాప్తంగా లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధానమంత్రి ఆవాస్ పధకం క్రింద దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పేదలకు ఇళ్ళ నిర్మాణం, దేశంలో పట్టణాలు, నగరాలను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయడానికి స్మార్ట్ సిటీస్, అమృత్, జన్ ధన్ యోజన, ముద్రాయోజన వంటి అనేక అపురూపమైన పధకాలు అమలుచేశారు.      

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వంలో అవినీతి అనే పదం వినిపించలేదంటే అతిశయోక్తి కాదు. పాలనలో పారదర్శకత, వేగం ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి గుదిబండగా మారిన సంస్థలను వదిలించుకున్నారు. ప్రభుత్వానికి కూడా ఆర్ధిక క్రమశిక్షణ అలవాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తప్ప కేంద్రమంత్రులు పెద్దగా విదేశీయాత్రలు చేసిన దాఖలాలు కనిపించవు. దశాబ్దాలుగా అమలుకు నోచుకోని ‘వన్ ర్యాంక్- వన్ పెన్షన్’ సమస్యను పరిష్కరించారు. అలాగే దశాబ్దాలుగా పెండింగులో ఉన్న జి.ఎస్.టి. ప్రతిపాదనను అమలులోకి తెచ్చారు. 

మోడీ ప్రభుత్వంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది విదేశాంగ విధానం. చైనా పట్ల అవసరమైనప్పుడు కటినంగా వ్యవహరిస్తూనే, మరోపక్క దానితో బలమైన స్నేహ సంబంధాలు కూడా కొనసాగిస్తుండటమే అందుకు చక్కటి ఉదాహరణ. పాకిస్తాన్ కు మోడీ కూడా మొదట స్నేహహస్తం అందించారు. కానీ అది తన కుక్కతోక బుద్ధిని ప్రదర్శించడంతో దానిపట్ల చాలా కటినంగా వ్యవహరిస్తున్నారు. పాక్ భూభాగంలో భారత ఆర్మీ చేత సర్జికల్ స్ట్రైక్ నిర్వహింపజేసి భారత్ విదేశంగా విధానంలో వచ్చిన మార్పును యావత్ ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశారు. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడేలా చేయగలిగారు. ఐక్యరాజ్యసమితిలో కూడా భారత్ ఉనికిని గుర్తించేలా చేయగలిగారు. 

ఇక ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో దేశంలో 21 రాష్ట్రాలలో భాజపా అధికారంలోకి రాగలిగింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలోకి భాజపా చొచ్చుకుపోయి అధికారం చేజిక్కించుకోగలిగింది. 

తన ప్రభుత్వానికి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా, “మా ప్రభుత్వానికి దేశమే ముఖ్యం. దేశ ప్రజల, భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొంటున్నాము. వాటికి ప్రజల ఆమోదం కూడా లభించడం మా అదృష్టం. ఒక బలమైన భారతదేశ నిర్మాణానికి మా ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది. మాకు అన్ని సమయాలలో అండగా నిలబడిన 125 కోట్ల మంది భారతీయులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను,” అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.


Related Post