తెలంగాణా రైతులకు మరో కానుక

May 26, 2018


img

ఇటీవలే పంటపెట్టుబడి చెక్కులు అందుకున్న రైతులందరికీ మరో శుభవార్త. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా చేయించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఒక్కో రైతుకి రూ.5 లక్షలు జీవితభీమా వర్తింపజేయబోతున్నారు.

భీమా సంస్థల నిబంధనల ప్రకారం 18-59 ఏళ్ళలోపు వయసున్న రైతులందరికీ దీనిని వర్తింపజేస్తారు. ఆధార్ కార్డులో పేర్కొనబడిన జన్మదిన తేదీ ఆధారంగా రైతుల వయసును పరిగణనలోకి తీసుకుంటారు. రైతులు తమ కుటుంబ సభ్యులలో ఎవరినైనా నామినీగా పెట్టుకోవచ్చు. ఇక నుంచి ప్రతీ నెల వ్యవసాయ అధికారులు స్వయంగా రైతుల వివరాలు నమోదు చేసుకొంటూ వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందజేస్తారు. వాటి ఆధారంగా రైతులకు భీమా వర్తింపజేయబడుతుంది. వ్యవసాయం చేయడం కోసం భూమి కొన్నప్పటి నుంచి అతను లేదా ఆమెను రైతుగా పరిగణించి ఈ జీవితభీమాను వర్తింపజేస్తారు.  

ఈ జీవితభీమా పధకం కోసం రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనవసరంలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ ఏడాది ఆగస్ట్ 1వ తేదీన ప్రీమియం చెల్లిస్తుంది. దీని కోసం దేశంలో అత్యంత విశ్వసనీయత, ప్రజాధారణ కలిగిన ప్రభుత్వరంగ సంస్థ ‘లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను సిఎం కెసిఆర్ ఎంచుకున్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ప్రభుత్వం-ఎల్.ఐ.సి. సంస్థ కలిపి జారీ చేసే భీమా సర్టిఫికేట్లు అందించబడతాయి. 

 ఈ పధకంలో విశిష్టత ఏమిటంటే, భీమా చేయబడిన రైతు ఏ కారణం చేత చనిపోయినప్పటికీ అతను లేదా ఆమె మరణించిన 10 రోజుల లోపుగానే రూ.5 లక్షలు భీమా సొమ్ము నామినీకి అందించాలని ప్రభుత్వం ఎల్.ఐ.సి.కి ముందే షరతు విధించింది. ఒకవేళ 10 రోజులలోగా భీమా మొత్తం రైతుకు అందించకపోతే ఎల్.ఐ.సి.సంస్థ ప్రభుత్వానికి జరిమానా చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు షరతులకు ఎల్.ఐ.సి. అంగీకరించినందునే సిఎం కెసిఆర్ దానికి ఈ భాద్యత అప్పజెప్పారు. 

భీమా  చేయబడిన రైతు చనిపోతే, అతను లేదా ఆమె డెత్ సర్టిఫికేట్ సమర్పిస్తే చాలు. ఎల్.ఐ.సి. సంస్థ రూ.5 లక్షలు భీమా సొమ్ము నామినీకి అందిస్తుంది. ఆ రైతు కుటుంబం ఆర్ధికసమస్యలలో చిక్కుకోకుండా ఈ భీమాసొమ్ము కాపాడుతుంది. 

ఒక రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా కల్పించడం దేశంలో ఇదే ప్రధమం. ఈ విషయంలో కూడా తెలంగాణా రాష్ట్రం దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రైతుల సంక్షేమం గురించి ఇంతలోతుగా ఆలోచించే మానవతా దృక్పధం ఉన్న ముఖ్యమంత్రి లభించడం రైతుల అదృష్టమేనని చెప్పకతప్పదు. ఇటువంటి మంచి పధకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు అభినందనలు.


Related Post