బాబుకి ఇంకా భయం తగ్గలేదా?

May 25, 2018


img

“నేనెవరికీ భయపడను...అయినా నేను ఎందుకు భయపడాలి? నేను నిప్పులాంటి మనిషిని...బులెట్ లాగ దూసుకుపోతాను. హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టింది నేనే,” ఈ మాటలు తరచూ ఎవరినోట..ఎందుకు వినిపిస్తుంటాయో అందరికీ తెలుసు. కానీ ఆ మాటలే అయనలో అభద్రతాభావాన్ని చాటి చెపుతుంటాయనే సంగతి అయన గ్రహించరు. పైగా ఆవిధంగా మాట్లాడిన ప్రతీసారి అయన ప్రజలు మరిచిపోతున్న ‘ఆ ఘటనలను’ స్వయంగా గుర్తు చేస్తున్నాననే సంగతి కూడా గ్రహించరు. ఇంత ఉపోద్ఘాతం చెప్పుకున్నాక అయన పేరు చెప్పుకోకపోతే ఏం బాగుంటుంది...ఆయనే ఏపి సిఎం చంద్రబాబు నాయుడు. 

మొన్న హైదరాబాద్ లో జరిగిన మహానాడులో అయన గంటన్నరసేపు ఏకధాటిగా మాట్లాడారు. కానీ పొరపాటున కూడా తెలంగాణా సిఎం కెసిఆర్, అయన ప్రభుత్వం, తెరాస పేరు రాకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టమైన విషయమే. ఒక్క ఇంగ్లీషు ముక్క లేకుండా తెలుగులో మాట్లాడినంత కష్టం! కానీ చంద్రబాబు నాయుడు అది సాధ్యమేనని నిరూపించి చూపారు. తద్వారా సిఎం కెసిఆర్ అంటే ఇంకా మనసులో భయం, బెదురూ పోలేదని నిరూపించుకున్నారు.  

చంద్రబాబు నాయుడు తన గంటన్నర ప్రసంగంలో యధాప్రకారం హైదరాబాద్ ను తాను ఏవిధంగా అభివృద్ధి చేసింది చెప్పుకున్నారు. తెలంగాణాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. తెలుగు తమ్ముళ్ళు ‘బొబ్బిలి పులి’, ‘కొండవీటి సింహం’ లా దూకాలని అన్నారు. ఇంకా అందరికీ తెలిసిన విషయాలు చాలా చాలా చెప్పారు. కానీ తెలంగాణాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన తెరాసను ఏవిధంగా డ్డీకొనాలో చెప్పనే లేదు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలా లేదా అనే విషయం తేల్చి చెప్పనే లేదు. విచిత్రమైన విషయం ఏమిటంటే అయన సిఎం కెసిఆర్, తెరాస ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడితే, టిటిడిపి నేతలు భాజపా, మోడీ ప్రస్తావన చేయకుండా జాగ్రత్తపడ్డారు. 

చంద్రబాబు నాయుడు భాజపాను, ప్రధాని నరేంద్రమోడీని నోరారా విమర్శించగా, టిటిడిపి నేతలు అయన సమక్షంలోనే సిఎం కెసిఆర్, అయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. అంటే వారిపాటి ధైర్యం కూడా చంద్రబాబు చేయలేకపోయారని అర్ధమవుతోంది. కారణాలు అందరికీ తెలిసినవే.  

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జరిగిన ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు పార్టీకి దిశానిర్దేశం చేయకుండా స్వోత్కర్షకే పరిమితం కావడం వలన టిటిడిపి నేతల శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని చెప్పక తప్పదు.


Related Post