అతి ప్రచారమే కొంప ముంచిందా?

May 25, 2018


img

భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పధకం అమలు విషయంలో అధికారులకు తగినంత సమయం, అవసరమైన శిక్షణ ఇచ్చినప్పటికీ, పాసుపుస్తకాలలో తప్పులు దొర్లాయంటే అందుకు అధికారులే భాద్యత వహించాల్సి ఉంటుంది. కానీ అందుకు ఇతర కారణాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ రెండు కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ చాలా ఎక్కువగా ప్రచారం చేసుకున్నారు. దేశంలో మరే రాష్ట్రమూ, ప్రభుత్వమూ చేయలేని ఈ పనులను కేవలం తాము మాత్రమే కేవలం 100 రోజుల వ్యవధిలో పూర్తి చేశామని అని అతిగా ప్రచారం చేసుకున్నారు. పైగా పనిగట్టుకొని ఇతర రాష్ట్రాలలో కూడా పేపర్ ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకున్నారు. వీటిద్వారా తెరాసకు రాజకీయలబ్ది కలగాలనే ఉద్దేశ్యంతోనే అంతగా ప్రచారం చేసుకొని ఉండవచ్చు.

కానీ ఆ అతిప్రచారం వలననే వాటికి ‘హైప్’ ఏర్పడింది. దానితో పాటే ప్రజల అంచనాలు కూడా బారీగా పెరిగిపోయాయి. ఒకవేళ ఈ పధకాలలో ఎటువంటి లోపాలు జరుగకుండా అంతా సవ్యంగా జరిగి ఉండి ఉంటే ఖచ్చితంగా రైతులందరూ తెరాస సర్కార్ ను మెచ్చుకొని ఉండేవారు. కానీ తెరాస అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. దీనివలన ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనుకుంటే, పాసు పుస్తకాలలో దొర్లిన తప్పుల కారణంగా రైతుల ఆగ్రహం చవి చూడవలసి వస్తోంది. 

నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే చేయించడం, దానిని బట్టి భూరికార్డులను ప్రక్షాళన చేయడం చాలా సంక్లిష్టమైన పని. దానికి 6-9 నెలల సమయం కూడా సరిపోదు. కానీ 100 రోజులలోనే పూర్తిచేశామని గొప్పలు చెప్పుకునేందుకు అధికారులపై ఒత్తిడి పెంచడంతో, గడువులోగా పనులు పూర్తి చేసేందుకు వారు ‘మమ’ అనిపించేసి ఉండవచ్చు. కనుక భూసర్వే, రికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలలో ఆ వివరాలు నమోదు చేయడం, వాటిని రైతులకు సకాలంలో పంచిపెట్టడంలో తప్పులు దొర్లడం సహజమే.     

ఒకవేళ ఈ పధకాల గురించి తెరాస సర్కార్ మరీ ఇంతగా ప్రచారం చేసుకోకుండా తమాయించుకొని ఉండి ఉంటే, ఎన్ని లోపాలు బయటపడినా ఇన్ని విమర్శలు ఎదుర్కోవలసి వచ్చేది కాదు. కానీ అందుకు విరుద్దంగా జరుగడంతో తెరాస సర్కార్ అప్రదిష్టపాలవుతోంది. గత ఏడాది బతుకమ్మ చీరల గురించి కూడా తెరాస నేతలు ఇలాగే అతిగా గొప్పలు చెప్పుకున్నారు. కానీ తరువాత ఏమి జరిగిందో అందరూ చూశారు.

కనుక తెరాస సర్కార్ ప్రవేశపెడుతున్న ఏ పధకంనైనా ముందుగా పైలట్ ప్రాజెక్టులాగ ఏదో ఒక ప్రాంతంలో అమలుచేసి చూసి, వాటిలో లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకున్నాక అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి, ఆ తరువాతే వాటి గురించి ఎంత ప్రచారం చేసుకున్నా ఎవరూ వేలెత్తి చూపలేరు కదా! 


Related Post