సార్వత్రిక ఎన్నికలలో కూడా అదే ఫార్ములా?

May 22, 2018


img

గుజరాత్, కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్, భాజపాలకు గుణపాఠాల వంటివని చెప్పవచ్చు. వాటి నుంచి కాంగ్రెస్ ఎంతో కొంత గుణపాఠం నేర్చుకొన్నట్లే ఉంది. అందుకే ‘ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో’ కూడా తెలుసుకొని కర్ణాటకలో నెగ్గగలిగింది. అయితే సార్వత్రిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే ఫార్ములాను అమలుచేయడానికి ఇష్టపడుతుందా?ఒకవేళ యూపియే కూటమికి బయటిపార్టీల మద్దతు అవసరమైతే, ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని జెడిఎస్ కు ఇచ్చి అధికారం దక్కించుకున్నట్లే, అప్పుడు ప్రధానమంత్రి పదవిని వేరే పార్టీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దపడుతుందా? అంటే అనుమానమే.

ఎందుకంటే, ఎప్పటికైనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపడితే చూడాలని సోనియా గాంధీ కోరిక. ఆమె కోరికను కాంగ్రెస్ నేతలు కూడా కాదనడం లేదు. పైగా కర్ణాటక ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఒక అనూహ్య ప్రకటన చేశారు. ‘సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి మెజార్టీ సాధిస్తే నేను ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి సిద్దమే’ అని చెప్పారు. అంటే కర్ణాటక ఫార్ములాను జాతీయస్థాయిలో అంగీకరించకపోవచ్చునని అర్ధమవుతోంది.

కానీ ముందే చెప్పుకున్నట్లు ‘ఎక్కడ తగ్గాలో’ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నేర్చుకున్నట్లే ఉంది కనుక అధికారం చేజారిపోయే ప్రమాదం ఉందని తెలిస్తే, అది వేరొకరికి ప్రధానమంత్రి పదవిని ఇవ్వడానికి సిద్దపడినా ఆశ్చర్యం లేదు. అసలు అధికారమే లేకుండా మరో ఐదేళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చొనే బదులు, పెద్ద పదవిని వదులుకోవడానికి సిద్దపడితే అధికారంలో కొనసాగవచ్చు కదా? కాంగ్రెస్ అధిష్టానం అందుకు సిద్దమైతే తెరాస, తెదేపా తదితర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా లభించవచ్చు.

అయినా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దేశంలో అనేక రాజకీయ పరిణామాలు, సమీకరణాలు జరుగవచ్చు కనుక వచ్చే ఎన్నికలలో యూపియే, ఎన్డీయే కూటములలో ఏది గెలుస్తుంది? ఎవరు ప్రధానమంత్రి అవుతారని ఆలోచించడం తొందరపాటే అవుతుంది.


Related Post