బిజెపికి ఆ అవకాశం కల్పిస్తున్న కెసిఆర్?

May 21, 2018


img

జెడిఎస్ నేత కుమారస్వామి బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ఏపి, తెలంగాణా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్, మమతా బెనర్జీలతో పాటు దేశంలో భాజపాయేతర పార్టీల నేతలను, ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కెసిఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ హాజరుకాబోతున్నట్లు తాజా సమాచారం. జెడిఎస్ అధినేత దేవగౌడతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే వారిరువురూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతోనే జెడిఎస్ కలిసి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న ఆ కార్యక్రమానికి దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిరువురూ హాజరయితే విశేషమే. ఇక ఫెడరల్ ఫ్రంట్ ఆశయానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినందున కెసిఆర్ ఇక జెడిఎస్ ను మరిచిపోవలసిందే.


ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మరొకవిధంగా ఉపయోగించుకోబోతోంది. దేశంలో భాజపాను వ్యతిరేకిస్తున్న ప్రాంతీయపార్టీలన్నిటినీ ఈ కార్యక్రమం ద్వారా ఒకే వేదికపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 

దేవగౌడ (జెడిఎస్), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), మాయావతి (బి.ఎస్.పి)లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇటీవల మోడీ సర్కార్ పై తిరుగుబాటు చేసి భాజపాతో తెగతెంపులు చేసుకొన్న చంద్రబాబు నాయుడు (తెదేపా) కూడా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు పలుకవచ్చు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి తెదేపా లోపాయికారిగా మద్దతు పలికితే ఏపిలో తెదేపాకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారిగా మద్దతు పలుకవచ్చు. తద్వారా రెండు పార్టీలు రాజకీయంగా లాభపడవచ్చు. కనుక జాతీయస్థాయిలో కూడా చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకవచ్చు. కనుక కర్ణాటకలో కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వ ఏర్పాటు దేశంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయవచ్చు. అదే జరిగితే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను విరమించుకోక తప్పదు. 

కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించి మాహాకూటమి ఏర్పడుతుందో లేదో తెలియదు కానీ ఈ కార్యక్రమానికి ఇద్దరు చంద్రులు హాజరయితే వారిని విమర్శించడానికి భాజపా, వైకాపాలకు మంచి అవకాశం కల్పించిన్నట్లవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.


Related Post