భాజపా తప్పిదాలే కాంగ్రెస్ కు వరంగా మారాయా?

May 21, 2018


img

గుజరాత్ లో భాజపా సర్కార్ కు ‘జలక్’ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో ఇంకా గట్టి జలక్ ఇచ్చింది. గుజరాత్ లో భాజపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయినా కర్ణాటకలో దాన్ని అడ్డుకోవడమే కాకుండా అధికారంలో నుంచి బలవంతంగా దింపేసి భాజపాపై ప్రతీకారం తీర్చుకోగలిగింది. 

‘గుజరాత్ ఎన్నికలలో తమ పార్టీ చేసిన చిన్న చిన్న తప్పిదాల వలన ఓడిపోయిందని, కర్ణాటకలో అవి మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని’ రాహుల్ గాంధీ చెప్పారు. కానీ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధించలేకపోగా గతంలో వచ్చినన్ని సీట్లు కూడా సంపాదించుకోలేకపోయింది. అంటే కాంగ్రెస్ తన లోపాలను సరిదిద్దుకోలేదని స్పష్టమయ్యింది. 

కానీ ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా, తెలివిగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. కాంగ్రెస్ పార్టీ 78 సీట్లు గెలుచుకొని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించినందున, 38 సీట్లు గెలుచుకున్న జెడిఎస్ తనకే మద్దతు ఇవ్వాలని కూర్చోని ఉండే ఉంటే జెడిఎస్ భాజపావైపు వెళ్ళిపోయుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాస్త తెలివిగా వ్యవహరించింది. అదే పెద్ద పార్టీ అయినప్పటికీ జెడిఎస్ కు మద్దతు ప్రకటించడమే కాకుండా ఆ పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడంతో ఆ పదవి కోసం చాలా ఆశపడుతున్న కుమారస్వామిని తనవైపు తిప్పుకోగలిగింది.  

ఇక గవర్నర్ వివాదాస్పద నిర్ణయాలను సుప్రీంకోర్టులో పదేపదే సవాలు చేయడం, కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి భాజపా నేతలు సాగించిన ఫోన్ సంభాషణలను బయటపెట్టడం ద్వారా భాజపా నైతికంగా ఎంత దిగజారిపోయిందో కాంగ్రెస్ పార్టీ డేశప్రజల దృష్టికి తీసుకురాగలిగింది. కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా, తెలివిగా అమలుచేసిన ఈ వ్యూహాల కారణంగానే భాజపా వెనకడుగు వేసింది. బలపరీక్ష పూర్తయ్యే వరకు కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ చేజారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం ఆ రెండు పార్టీలకు కలిసి వచ్చింది. 

గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో ఇంచుమించు ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. కానీ గుజరాత్ లో భాజపా చురుకుగా వ్యవహరించి అధికారం దక్కించుకోవడంతో అది విజయం సాధించినట్లు గర్వంగా చెప్పుకోగలిగింది కానీ కర్ణాటకలో కూడా దాదాపు గెలిచినప్పటికీ, భాజపా నేతలు, గవర్నర్ ప్రదర్శించిన అత్యుత్సాహం వలన అభాసుపాలైంది. తీరని అప్రదిష్ట మూటకట్టుకొంది. 

ఇక ‘కర్ణాటకతో దక్షిణాదిలో తమ జైత్రయాత్ర మొదలవుతుందని’ భాజపా నేతలు పదేపదే చెప్పుకోవడం దక్షిణాది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించాయని చెప్పకతప్పదు. ఆ మాట ‘దక్షిణాది రాష్ట్రాలపై భాజపా దండయాత్రకు బయలుదేరిందనే’ భావన కలిగించడంతో కర్ణాటకతో సహా దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరికీ ఆగ్రహం కలిగించి ఉంటే ఆశ్చర్యం లేదు. ప్రజలలో ఏర్పడిన ఈ వ్యతిరేకతను వచ్చే ఎన్నికలలోగా తగ్గించుకునేందుకు భాజపా గట్టి ప్రయత్నాలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఏది ఏమైనప్పటికీ కర్ణాటకలో భాజపా తన ‘అసలు రూపం’ ప్రదర్శించిందని చెప్పక తప్పదు.


Related Post