అయితే కేటిఆర్ సిఎం అవరా?

May 19, 2018


img

తెలంగాణా సిఎం కెసిఆర్ 2019 ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నట్లు ప్రకటించారు కనుక రాష్ట్రంలో మళ్ళీ తెరాస అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. 

రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ శుక్రవారం సచివాలయంలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆ సందర్భంగా విలేఖరులు ఇదే ప్రశ్న అడిగినప్పుడు, “సిఎం కెసిఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మరో 15 ఏళ్ళు వరకు ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. అయన రిటైర్ అయ్యేటప్పుడు మేము కూడా రిటైర్ అయిపోతాము. కనుక ఆయన తరువాత ఎవరు? పార్టీలో, ప్రభుత్వంలో నెంబర్: 2 ఎవరు?వంటి ప్రశ్నలకు తావే లేదు. అయినా నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు. ప్రస్తుతం నేను నిర్వహిస్తున్న పనులతో చాలా సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఎన్నికలలో నేను మళ్ళీ సిరిసిల్లా నుంచే పోటీ చేస్తాను. వేరే నియోజకవర్గానికి మారాల్సిన అవసరమే లేదు,” అని కేటిఆర్ చెప్పారు. 

సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నానని చెపుతుంటే, మరో 15 ఏళ్ళ వరకు ఆయనే తెలంగాణాకు ముఖ్యమంత్రిగా ఉంటారని కేటిఆర్ చెప్పడం విశేషం. ఇదివరకు సిఎం కెసిఆర్ ఒక సభలో మాట్లాడుతూ, హైదరాబాద్ కేంద్రంగా జాతీయరాజకీయాలు తిరిగేలా చేస్తానని చెప్పారు. కనుక కెసిఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాలలో పాల్గొంటారని కేటిఆర్ చెపుతున్నారా? లేదా 2019 ఎన్నికల తరువాత కెసిఆర్ డిల్లీకి మారి అక్కడే ఉంటూ జాతీయ రాజకీయాలలో పాల్గొంటారని ఇప్పుడే ప్రకటిస్తే పార్టీలో అంతర్గతంగా, ప్రతిపక్షాల నుంచి ఊహించని సమస్యలు, సవాళ్ళు పుట్టుకు వస్తాయనే ఉద్దేశ్యంతోనే కేటిఆర్ ఈవిధంగా చెప్పారా? అనే సందేహం కలుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం పూర్తయితే వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారనే విషయంపై కూడా స్పష్టత రావచ్చు. 


Related Post