కవితక్క చెప్పింది నిజమా?

May 19, 2018


img

తెరాస ఎంపి కవిత శుక్రవారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ “కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూస్తే దేశంలో జాతీయపార్టీలకు గడ్డుకాలం నడుస్తున్నట్లు అర్ధమవుతుంది. ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా అవి తమంతట తాముగా ఎక్కడా ప్రభుత్వం ఏర్పాటుచేయగల పరిస్థితిలో లేవని స్పష్టం అవుతోంది. సిఎం కెసిఆర్ చెప్పినట్లుగానే కర్ణాటక ప్రజలు ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. రానున్న రోజులలో దేశవ్యాప్తంగా ఫెడరల్ ఫ్రంట్ కు ఆదరణ పెరుగుతుంది,” అని అన్నారు. 

తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎంపి కవిత చెప్పినవాటిని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే అవన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతున్నాయి. అలాగే జాతీయ పార్టీల గురించి ఆమె చెప్పినది కూడా నిజమే. కానీ కర్ణాటక ప్రజల తీర్పును ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా ఆపాదించుకోవడమే అసంబద్దంగా ఉంది. 

ఎడ్యూరప్ప అవినీతిపరుడని, భాజపాను గెలిపిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని తెలిసి ఉన్నప్పటికీ కర్ణాటక ప్రజలు భాజపాకే ఓట్లు వేసి 104 సీట్లు కట్టబెట్టారు. 10-15 నియోజకవర్గాలలో భాజపా అభ్యర్ధులు స్వల్పతేడాతో ఓడిపోవడం వలననే భాజపా మ్యాజిక్ ఫిగర్ 112కు చేరుకోలేకపోయింది లేకుంటే అదే ఎవరి మద్దతు లేకుండా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండేది. 

సిఎం కెసిఆర్, తెదేపా నేతలు జెడిఎస్ కు మద్దతు ప్రకటించడం వలన కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ప్రజలలో కొంతమంది భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చు. అయినా భాజపా 104 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ భాజపా, ఎడ్యూరప్ప వ్యూహాలు ఫలిస్తే నేడు భాజపాయే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. కనుక కన్నడ ప్రజల తీర్పును ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలమని చెప్పుకోవడం సరికాదు. 

ఇక సిఎం కెసిఆర్ మద్దతు ఇచ్చిన ‘జెడిఎస్’ ఫెడరల్ ఫ్రంట్ స్పూర్తికి, ఆశయానికి విరుద్దంగా కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది. కుదిరితే ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు కూడా సిద్దం అవుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములుగా చేరే ప్రాంతీయ పార్టీలు ఏవిధంగా అవకాశవాద రాజకీయాలు చేస్తాయో జెడిఎస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఆ కారణంగా జెడిఎస్ గురించి సిఎం కెసిఆర్ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆలోచన ఇంకా ఆచరణలోకి రాకమునుపే ఎదురుదెబ్బ తగిలి దాని విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారినప్పుడు రానున్న రోజులలో దానికి మరింత ఆదరణ పెరుగుతుందని ఏవిధంగా భావించగలం?

భాజపా వ్యతిరేక శక్తులను, ప్రజలలో చీలిక తెచ్చి భాజపాకు తోడ్పడటానికే సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. కర్ణాటకలో ఇప్పుడు జరుగుతున్నది అదే కదా? ఒకపక్క అయనపై అనుమానాలు  వ్యక్తం అవుతుంటే, మరోపక్క ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములని భావిస్తున్న దేవగౌడ, కుమారస్వామి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వంటివారందరూ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతుండటం అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఈ నేపద్యంలో ఫెడరల్ ఫ్రంట్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇటువంటి అవకాశవాద పార్టీలు, నేతలతో జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు ఏవిధంగా సాధ్యం? 


Related Post