ఏంటిది వజూభాయ్?

May 18, 2018


img

కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలాపై దేశవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అయన నిసిగ్గుగా భాజపా కనుసన్నలలో వ్యవహరిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. నిన్న ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను శాసనసభకు నామినేట్ చేసి విమర్శలపాలైన గవర్నర్ వజూభాయ్ ఇవ్వాళ్ళ ఆనవాయితీకి విరుద్దంగా ప్రోటెం-స్పీకర్ (తాత్కాలిక స్పీకర్)గా భాజపా ఎమ్మెల్యే కెజి బొప్పయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలలో అందరికంటే ఎక్కువ సీనియరిటీ ఉన్న ఎమ్మెల్యేను ప్రోటెం-స్పీకర్ గా నియమించడం ఆనవాయితీ. దాని ప్రకారం 8సార్లు శాసనసభ్యుడిగా ఎంపికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశ్ పాండేను నియమించాలి. కానీ కేవలం మూడుసార్లు ఎన్నికైన కెజి బొప్పయ్యను నియమించారు. 

రేపు శాసనసభలో జరుగబోయే బలపరీక్షలో ప్రోటెం-స్పీకర్ కీలకపాత్ర పోషిస్తారు. ఒకవేళ భాజపా, కాంగ్రెస్-జెడిఎస్ కూటమికి సరిసమానంగా సభ్యుల మద్దతు లభించినట్లయితే అప్పుడు ప్రోటెం-స్పీకర్ వేసే ఓటు నిర్ణయాత్మకమవుతుంది. ప్రోటెం-స్పీకర్ భాజపా ఎమ్మెల్యే గనుక అటువంటి పరిస్థితే వస్తే తప్పకుండా భాజపాకే ఓటు వేస్తారు. అదీగాక రేపు బలపరీక్ష జరిగే సమయంలో అయన భాజపాకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది. ఆ చిన్న అవకాశం లభిస్తే ఎడ్యూరప్ప ఏదోవిధంగా కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను మాయచేసి తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీ గవర్నర్ నిర్ణయంపై మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బహుశః మళ్ళీ దీనిపై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందేమో? ఏది ఏమైనప్పటికీ కర్ణాటక గవర్నర్ మరీ అంత నిసిగ్గుగా భాజపా నేతలాగ వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. 


Related Post