కెసిఆర్ స్పందించలేదేమిటో?

May 18, 2018


img

కర్ణాటక ఎన్నికలకు ముందు సిఎం కెసిఆర్ బెంగళూరు వెళ్ళి జెడిఎస్ అధినేతలు దేవగౌడ, కుమారస్వామిలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. అవసరమైతే ఎన్నికలలో వారి పార్టీ తరపున ప్రచారం చేయడానికి వస్తానని ప్రకటించారు. ఆ తరువాత కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. 

గవర్నర్ తమను కాదని ఎడ్యూరప్ప చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడంతో దేవగౌడ, కుమారస్వామి ఇద్దరూ భగ్గుమన్నారు. కేంద్రప్రభుత్వంపై తాము చేయబోయే పోరాటానికి సిఎం కెసిఆర్ మద్దతు ఇవ్వాలని కోరారు. అంతకు ముందు అడుగక మునుపే  వారికి మద్దతు ఇస్తానని ప్రకటించిన సిఎం కెసిఆర్, ఇప్పుడు వారు నోరు తెరిచి అడిగినా ఇంతవరకు స్పందించలేదు. కారణం కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. తాను ఏ కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేవగౌడని కలిసారో వారు అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అయ్యారు. భాజపా బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కే తీసుకువచ్చిపెట్టాయి. 

రేవంత్ రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జెడిఎస్-భాజపాలపై మీ వైఖరి ఏమిటో తెలియజేయాలని కెసిఆర్ ను నిలదీస్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన దేవగౌడ పిలుపుకు సిఎం కెసిఆర్ స్పందించలేదు. అందుకే తెరాస నేతలు ఎవరూ కూడా హైదరాబాద్ వచ్చిన జెడిఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేయలేదు. జెడిఎస్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తే పరోక్షంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని సమర్దిస్తున్నట్లే అవుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో సమర్ధించలేదు కనుక ప్రస్తుతానికి మౌనం వహించడమే మేలని తెరాస భావించడం సహజమే.


Related Post