కర్ణాటకలో భాజపా గెలిచిందా...ఓడిపోయిందా?

May 18, 2018


img

కర్ణాటక కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించి వారికి నగరంలో హోటల్ హయత్ లో బస ఏర్పాటు చేశారు. ఇది నేటి రాజకీయ పరిస్థితులలో చాలా సామాన్యమైన విషయంగానే కనిపించవచ్చు. కానీ ఒక జాతీయపార్టీ బారి నుంచి మరో జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం హైదరాబాద్ తరలించవలసిరావడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ఘోర అవమానం. కాంగ్రెస్, జెడిఎస్ పొత్తులు అపవిత్రమైనవి, అనైతికమైనవి అని వాదిస్తున్న భాజపా నేతలు రాజకీయంగా తమ బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నయాన్నోభయాన్నో లోబరుచుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారిరువురినీ భాజపాయే ప్రలోభపెట్టి వశపరుచుకొందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

కర్ణాటకలో అధికారం దక్కించుకోవడానికి భాజపా చేస్తున్న నీచరాజకీయాలను చూసి వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్షపార్టీలు తీవ్రవిమర్శలు చేస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ మీడియాలో కూడా భాజపా తీరును తప్పుపడుతూ కధనాలు, చర్చలు వస్తున్నాయి. కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకొని ఎడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయగలరేమో కానీ జరుగుతున్న ఈ పరిణామాలు దేశప్రజలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలలో భాజపా పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని, దాని వలన సార్వత్రిక ఎన్నికలలో భాజపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా అధిష్టానం గుర్తించినట్లు లేదు. 

తమ పార్టీ అవినీతికి వ్యతిరేకమని గొప్పలు చెప్పుకొనే భాజపా కర్ణాటకలో మళ్ళీ అధికారం దక్కించుకోవడం కోసమే అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్ళివచ్చిన ఎడ్యూరప్పకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అయన ఇంకా పాలన ప్రారంభించక మునుపే తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఒకవేళ అయన కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేలను లోబరుచుకొని బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మున్ముందు మరెంత గొప్పగా కర్ణాటకను పాలిస్తారో చూడాలి. 

ప్రభుత్వం పూర్తిగా అయన చేతికి వచ్చిన తరువాత అయన గతంలోలాగే భాజపాను ఉప్మాలో కరివేపాకులాగ తీసి పక్కన పడేసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు భాజపా పేరుకు కర్ణాటకను కూడా గెలుచుకున్నామని చెప్పుకోగలదు కానీ ఆ రాష్ట్రంలో భాజపాకు కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. పైగా ఎడ్యూరప్పవంటి వ్యక్తికి పార్టీని, ప్రభుత్వాన్ని అప్పగించినందుకు, అయనను ముఖ్యమంత్రి చేయడం కోసం నీచ రాజకీయాలు చేసినందుకు తీరని అప్రదిష్ట, ప్రజలలో వ్యతిరేకత మిగలవచ్చు.  


Related Post