అందుకే స్టాలిన్ రాలేదా?

May 16, 2018


img

సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించేందుకు చెన్నై వెళ్ళి డిఎంకే అధినేత కరుణానిధిని, అయన కుమారుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో, కరుణానిధి కుమార్తె కనిమోళితో సమావేశమయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన తెలంగాణాలో తన ప్రభుత్వం అమలుచేయబోతున్న రైతుబంధు పధకం గురించి వివరించి, మే 10న జరిగే ఆ కార్యక్రమానికి రావలసిందిగా స్టాలిన్ ను ఆహ్వానించగా అయన అందుకు అంగీకరించారు. కానీ స్టాలిన్ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆహ్వానించినప్పుడు సాధారణంగా ఎవరూ తిరస్కరించరు. స్టాలిన్ తిరస్కరించకపోయినా ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. అందుకు బలమైన కారణమే వినిపిస్తోంది. 

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కెసిఆర్ బెంగళూరు వెళ్ళి దేవగౌడని, అయన కుమారుడు కుమారస్వామిని కూడా కలిసారు. కనుక జెడిఎస్ కూడా ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

గత కొంతకాలంగా తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మద్య కావేరీబోర్డు ఏర్పాటు గురించి వివాదం నడుస్తోంది. తమిళనాడు దాని కోసం పోరాడుతుండగా కర్ణాటక దానిని వ్యతిరేకిస్తోంది. కనుక కర్ణాటకకు చెందిన జెడిఎస్ తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లో పనిచేయడానికి డిఎంకె ఇష్టపడటంలేదని సమాచారం. ఒకవేళ సిద్దపడితే తమిళనాడులో మిగిలిన అన్ని పార్టీలు “డిఎంకె పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని ఆరోపణలు చేస్తే, డిఎంకెపార్టీ తమిళనాడులో రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. బహుశః అందుకే స్టాలిన్ రైతుబంధు పధకం ప్రారంభోత్సవానికి హాజరుకాలేదని అర్ధమవుతోంది. 

దేశంలో ప్రాంతీయపార్టీలన్నీ ఇంచుమించుగా ఇదేవిధంగా ఆలోచిస్తాయి. వాటికి తమ రాష్ట్రాలలో రాజకీయ ప్రయోజనాలు, పొరుగు రాష్ట్రాలతో ఉండే ఇటువంటి సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఉదాహరణకు సిఎం కెసిఆర్ త్వరలో ఓడిశా, ఆంధ్రా ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయిక్, చంద్రబాబు నాయుడులను కలవాలనుకొంటున్నారు. ఏపి, ఓడిశాల మద్య పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోను సమస్యలపై అభిప్రాయభేదాలున్నాయి. కనుక బిజెడి,తెదేపాలు కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఇదేవిధంగా ఇతర రాష్ట్రాలలో కూడా ఊహించని సమస్యలు ఎదురవవచ్చు. కనుక ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం, దాని నిర్వహణ రెండూ కత్తిమీద సామువంటివేనని చెప్పవచ్చు. మరి కెసిఆర్ ఏవిధంగా అందరినీ కలుపుకొనిపోతారో చూడాలి. 


Related Post