భాజపాకు తెలుగువారి దెబ్బ?

May 16, 2018


img

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో భాజపాకు 104 సీట్లు మాత్రమే సాధించి ‘మ్యాజిక్ ఫిగర్ 112’ కు కాస్త దూరంలో నిలిచిపోవడానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాలే కారణమా? అంటే అవుననే చెప్పుకోవాలి.

ఏపికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందంటూ తెదేపా నేతలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కెసిఆర్ జెడిఎస్ కు మద్దతు ప్రకటించడంతో, కర్ణాటకలో స్థిరపడిన ఆంధ్రా, తెలంగాణావాసులు భాజపాకు వ్యతిరేకంగా ఓట్లేశారు. కర్ణాటకలో తెలుగువారు అధికంగా ఉండే బాగేపల్లి నుంచి భాజపా తరపున పోటీచేసిన నటుడు సాయి కుమార్ డిపాజిట్లు కోల్పోయారు. అదేవిధంగా తెలుగువారు ఎక్కువగా ఉండే రాయచూరు, బళ్ళారి, చిక్ బళ్ళాపూర్, కోలార్ తదితర ప్రాంతాలలో భాజపా కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోగా, జెడిఎస్-9, కాంగ్రెస్-32 సీట్లు గెలుచుకొన్నాయి. అంటే భాజపా ఖాతాలో పడవలసిన మరికొన్ని సీట్లు జెడిఎస్, కాంగ్రెస్ పార్టీల ఖాతాలో పడినట్లు అర్ధమవుతోంది. తెలుగు ప్రజలలో వ్యతిరేకత లేకపోయుంటే ఆ ప్రాంతాలలో భాజపా అవలీలగా మరో 10-12 సీట్లు గెలుచుకొని, ఎవరి మద్దతు లేకుండానే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగి ఉండేది. రెండు తెలుగు రాష్ట్రాలను, పార్టీలను తక్కువగా అంచనా వేసినందుకు భాజపా బారీ మూల్యమే చెల్లించవలసివస్తోందని అర్ధమవుతోంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జెడిఎస్ కు కేవలం మద్దతు పలికితేనే ఫలితాలు ఈవిధంగా వచ్చాయి. ఒకవేళ కెసిఆర్, చంద్రబాబు, తెరాస, తెదేపా నేతలు కర్ణాటక వెళ్ళి జెడిఎస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉండిఉంటే కాంగ్రెస్, భాజపాలకు ఇప్పుడు వచ్చినన్ని సీట్లు కూడా వచ్చే ఉండేవికావేమో? 

పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఎన్నికలలోనే తెలుగు రాష్ట్రాలు ఇంత ప్రభావం చూపి భాజపాను ఇంత దెబ్బ తీయగలిగినప్పుడు, ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో తెరాస, తెదేపాలను భాజపా ఎదుర్కోగలదా? అనే సందేహం కలుగుతోంది. కనుక ‘కర్ణాటక తరువాత తెలంగాణాపై దృష్టిపెట్టబోతున్నామని’ భాజపా నేతలు గొప్పలు చెప్పుకోవడం మానుకొని, తెలుగు రాష్ట్రాలను గౌరవిస్తూ రాజకీయాలకు అతీతంగా వాటి అభివృద్ధికి తోడ్పడితే వారికే మంచిది.


Related Post