కింగ్ మేకర్స్ కు శుభాకాంక్షలు: కెసిఆర్

May 16, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ జెడిఎస్ అధినేతలు దేవగౌడ అయన కుమారుడు కుమారస్వామిలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, భాజపాలలో రెండూ ప్రభుత్వ ఏర్పాటుకు తగినన్ని సీట్లు సంపాదించుకోలేకపోవడంతో జెడిఎస్ మద్దతు తప్పనిసరి అయ్యింది. ఆ కారణంగా జెడిఎస్ కింగ్ మేకర్ అయ్యింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజారిపోకుండా ఉండేందుకు, జెడిఎస్ కు మద్దతు ఇచ్చి కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేయడానికి అంగీకరించడంతో ‘కింగ్ మేకర్’ ఇప్పుడు ‘కింగ్’ కాబోతున్నారు. ఈ పరిణామాలను అన్నిటినీ నిశితంగా గమనిస్తున్న సిఎం కెసిఆర్, ఈసందర్భంగా దేవగౌడ, కుమారస్వామిలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

జాతీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి మనుగడ సాగించక తప్పని పరిస్థితి ఏర్పడిందని కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘లౌకిక శక్తులను’ జెడిఎస్ బలోపేతం చేయాలని కెసిఆర్ కోరినట్లు సమాచారం. కాంగ్రెస్, భాజపాలలో ‘లౌకిక శక్తులు’ అంటే ‘కాంగ్రెస్’ అని వేరే చెప్పనవసరం లేదు. అదేనిజమైతే, ఇది చాలా విచిత్రమైన పరిస్థితే అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలని కెసిఆర్ కోరుకోవడం నిజమైతే అది విచిత్రమే కదా? 

ఇక ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామి అవుతారని భావిస్తున్న మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతూ నిన్న ట్వీట్ చేశారు. కాంగ్రెస్-జెడిఎస్ చేతులు కలిపితే ఫలితం మరోలా ఉండేదని ఆమె అన్నారు.

 ఇక ఫెడరల్ ఫ్రంట్ లో మరో భాగస్వామిగా భావిస్తున్న జెడిఎస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అవుతోంది. “ఒకవేళ మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినన్ని సీట్లు రాకపోతే మేము ప్రతిపక్ష బెంచీలలో కూర్చొంటామే తప్ప కాంగ్రెస్, భాజపాలకు మద్దతు ఈయబోము,” అని ఎన్నికలకు ముందు చెప్పిన కుమారస్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దమయ్యారు. 

ఒకవేళ జెడిఎస్ ఎమ్మెల్యేలలో ఎడ్యూరప్ప చీలిక తేగలిగితే, అప్పుడు అధికారం కోసం కుమారస్వామి భాజపాతో చేతులు కలపడానికి సిద్దపడినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి అవకాశవాద రాజకీయనేతలతో జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు సాధించడం ఏవిధంగా సాధ్యమో సిఎం కెసిఆరే చెప్పాలి.


Related Post