మాకే బలం ఉంది కానీ... యెడ్యూరప్ప

May 15, 2018


img

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు కాంగ్రెస్, భాజపాలు గెలుచుకోలేకపోవడంతో ప్రలోభాలపర్వం మొదలైంది. 

కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా, తెలివిగా పావులు కదిపి కేవలం 38 సీట్లు గెలుచుకొన్న జెడిఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడమే కాకుండా, ఆ పార్టీ అధినేత కుమారస్వామికే ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది. దాంతో జెడిఎస్ ను భాజపావైపు మొగ్గకుండా నిలువరించగలిగింది. ఆ తరువాత కాంగ్రెస్, జెడిఎస్ నేతలు రాష్ట్ర గవర్నర్ వాజుభాయి వాలాను కలిసి శాసనసభలో తమ కూటమికి 116 ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరారు. 

వారి తరువాత భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎడ్యూరప్ప కూడా గవర్నర్ వాజుభాయి వాలాను కలిసి, ఎన్నికల తరువాత అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవలసిందిగా కోరారు. జెడిఎస్ లో ఒక వర్గం మద్దతు తనకే ఉందని అయన చెప్పుకొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని చెపుతూనే శాసనసభలో బలనిరూపణకు వారం రోజులు గడువు ఇవ్వాలని యెడ్యూరప్ప కోరడం విశేషం.

ఇరుపార్టీల నేతలు చెప్పింది విన్న గవర్నర్ వాజుభాయి వాలా తన నిర్ణయాన్ని రెండు రోజులలో తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ రెండు రోజులలోనే జెడిఎస్ ఎమ్మెల్యేలను నయాన్నో, భయన్నో లొంగదీసుకోవడానికి భాజపా ప్రయత్నించవచ్చని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. శాసనసభలో బలనిరూపణ జరిగేవరకు జెడిఎస్ లో చీలికరాకుండా, దాని ఆలోచనలలో మార్పు రాకుండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం దక్కుతుంది. కానీ ఈ రెండు రోజులలో ఏమైనా జరుగవచ్చు. కనుక ప్రభుత్వ ఏర్పడేవరకు ప్రలోభాలపర్వం కొనసాగుటూనే ఉంటుంది. 


Related Post