పూర్తిగా వికసించలేకపోయిన కమలం

May 15, 2018


img

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ముగింపు దశకు చేరుకొనేసరికి అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం 12గంటల వరకు మంచి ఆధిక్యత కనబరిచిన భాజపా హటాత్తుగా బ్రేకులు వేసినట్లు ఆగిపోయింది. మొదటి నుంచి భాజపా మంచి ఆధిక్యత కనబరుస్తూ దూసుకుపోవడం చూసి ఇక తమ పార్టీయే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని భావించిన భాజపా శ్రేణులు వీధుల్లోకి వచ్చి రంగులు జల్లుకొంటూ,, డప్పులు మోగిస్తూ,  డ్యాన్సులు చేస్తూ సంబరాలు మొదలుపెట్టేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 113 సీట్లు సాధించలేని పరిస్థితి కనిపిస్తోందిపుడు. 

తాజా సమాచారం ప్రకారం భాజపా 90 సీట్లు గెలుచుకొని మరో 14 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. అంటే మొత్తం 104 సీట్లు మాత్రమే గెలుచుకోబోతోందని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 9 సీట్లు అవసరం కనుక జెడిఎస్ మద్దతు తప్పనిసరవుతుంది. 

ఇక కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానానికే పరిమితమైంది. అది 61 సీట్లు గెలుచుకొని మరో 17 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. అంటే మొత్తం 78 సీట్లు గెలుచుకోబోతోందని అర్ధమవుతోంది. 

ఇక దేవగౌడకు చెందిన జెడిఎస్ 28 సీట్లు గెలుచుకొని మరో 10 స్థానాలలో ఆధిక్యతలో ఉంది కనుక అది మొత్తం 38 సీట్లు గెలుచుకోబోతోంది. ఇక స్వతంత్ర అభ్యర్దులలో ఇద్దరు మాత్రమే విజయం సాధించారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు భాజపా గెలుచుకోలేకపోయింది కనుక కర్ణాటకలో రాజకీయాలు మళ్ళీ రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా మారిన ఈ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జెడిఎస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఒకవేళ జెడిఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే రెండు పార్టీలవి కలిపి మొత్తం 116 సీట్లు అవుతాయి కనుక ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమే. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది కనుక జెడిఎస్ దానికి మద్దతు ఇచ్చి అధికారం పంచుకొన్నా ఆశ్చర్యం లేదు. 

జెడిఎస్ తప్పకుండా ‘కింగ్ మేకర్’ అవుతుందని అందరూ నమ్ముతూనే ఉన్నారు. కానీ మధ్యలో భాజపా పుంజుకోవడంతో దాని అవసరం ఉండకపోవచ్చుననిపించింది. కానీ చివరికి కింగ్ మేకర్ అయ్యింది. కనుక ఇప్పుడది కాంగ్రెస్, భాజపాలలో దేనికి మద్దతు ఇస్తుందో చూడాలి.

ఆ పార్టీ నేత కుమారస్వామి చెప్పినట్లుగా ఒకవేళ అది దేనికీ మద్దతు ఈయకుండా ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవాలనుకొంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకులొంగి కాంగ్రెస్ లేదా భాజపాలలోకి జారిపోవడం ఖాయం కనుక అప్పుడు జెడిఎస్ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వస్తే స్పష్టత వస్తుందనుకొంటే ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండటం విశేషం.         



Related Post