మూడు లక్షల ఇళ్ళు నిర్మిస్తాం: కేటిఆర్

April 25, 2018


img

నూకపల్లి గ్రామంలో రూ.206 కోట్లు వ్యయంతో నిర్మించబోతున్న 4,160 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు మంత్రి కేటిఆర్ మంగళవారం శంఖుస్థాపన చేశారు. అనంతరం జగిత్యాల మండలంలో మోతె గ్రామంలో తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటిఆర్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, గత 46 నెలలలో మొత్తం 2.72 లక్షల ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ అధనంగా మరో 30,000 ఇళ్ళను మంజూరు చేశారని చెప్పారు. 

ఎంపి కవిత అభ్యర్ధన మేరకు జగిత్యాలకు 4,000 ఇళ్ళు మంజూరు అయ్యాయని చెప్పారు. ఈ ఐదేళ్ళ కాలంలో మొత్తం 3 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.48,000 కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. 

దేశంలో మరే రాష్ట్రంలోను ప్రభుత్వాలు పేదల ఇళ్ళ కోసం ఇంత ఖర్చు చేయడం లేదన్నారు. అంతే కాదు...మరే రాష్ట్రంలోను పేదల కోసం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ళు నిర్మించడం లేదని చెప్పారు. యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి నిర్మించబడుతున్న ఇళ్ళు ఒక ఎత్తైతే, ఒక్క తెలంగాణా రాష్ట్రంలో నిర్మించబడుతున్న ఇళ్ళు మరో ఎత్తని మంత్రి కేటిఆర్ అన్నారు.

ఇది నిసందేహంగా ఒక అద్భుతమైన పధకమే. కానీ ఈ 46 నెలలలో ఎన్ని ఇళ్ళు నిర్మించి పేదప్రజలకు అందించారు? అనే ప్రశ్నకు తెరాస సర్కార్ సమాధానం చెప్పడంలేదు. ఈ 46 నెలలలో కనీసం లక్ష ఇళ్ళు నిర్మించి పేదలకు అందించగలిగి ఉండి ఉంటే తెరాస సర్కార్ గొప్పదనం గురించి తెరాస నేతలు చెప్పుకొనవసరం లేదు. ప్రజలే తమ ప్రభుత్వం గొప్పదనం గురించి గొప్పగా చెప్పుకొనేవారు. కానీ 46 నెలలు గడిచిపోయిన తరువాత ఇంకా శంఖుస్థాపనలు చేస్తూ వాటి గురించి తెరాస నేతలు గొప్పలు చెప్పుకోవడం అంటే ‘అడ్వాన్స్ గా వాటి క్రెడిట్’ తీసుకొనే ప్రయత్నమేనని చెప్పవచ్చు. అయితే ఈవిధంగా చేస్తున్న పనుల గురించి గొప్పగా చెప్పుకొని ప్రజలను ఆకట్టుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా తప్పదు. 

వచ్చే ఎన్నికలలోగా తెరాస సర్కార్ నిజంగానే మూడు లక్షల ఇళ్ళు నిర్మించి పేదలకు అందించగలిగితే ప్రజలే దానికి మళ్ళీ పట్టం కడతారు. కానీ ఇప్పుడు శంఖుస్థాపనలకే పరిమితమయ్యి, మళ్ళీ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిచేస్తామంటే ప్రజలు నమ్మకపోవచ్చు. కనుక మిగిలిన ఈ 9 నెలలలో మూడు లక్షల ఇళ్ళ నిర్మాణాలు పూర్తిచేసి పేదప్రజల చేతిలో పెట్టడానికి తెరాస సర్కార్ గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది.


Related Post