తెలంగాణాలో జనసేన...ప్రభావం చూపగలదా?

April 24, 2018


img

వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలోను పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ వచ్చే నెల మొదటివారంలో కరీంనగర్ లో జనసేన పార్టీ మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కానీ సినిమాలు వదులుకొని రాజకీయాలలోకి వచ్చినప్పుడు మొట్టమొదట చేయవలసిన పని పార్టీ నిర్మాణం చేసుకోవడం. కానీ వస్తూనే తెదేపాపై యుద్ధం ప్రకటించి బలమైన మిత్రక్షాన్ని దూరం చేసుకొన్నారు. భాజపాను ఎప్పుడో దూరం చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. జగన్ అవినీతి కేసుల కారణంగా వైకాపాకు దూరంగా ఉంటున్నారు. ఇక ఏపిలో బొత్తిగా బలం లేని వామపక్షాలతో మాత్రం కాస్త సన్నిహితంగా ఉంటున్నారు. అంటే రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారకోవచ్చు. 

ఇక శ్రీరెడ్డి వివాదంలో తలదూర్చి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా బలమైన మీడియాపై కూడా యుద్ధం ప్రకటించి మీడియాను కూడా శత్రువులుగా మార్చుకొన్నారు. పైగా సుదీర్ఘమైన న్యాయపోరాటం చేస్తామని చెపుతున్నారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఎన్నికలకు పార్టీని సిద్దం చేసుకోవలసిన ఈ సమయంలో ఇన్ని సమస్యలు కొనితెచ్చుకోవడం తెలివైన పని కాదని చెప్పకతప్పదు. 

అదే.. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాగానే నిర్విరామంగా ‘ఓదార్పు యాత్రలు’ చేసి అతితక్కువ సమయంలోనే పార్టీని నిర్మించుకొన్నారు. గత ఎన్నికలలో వైకాపాకు తృటిలో విజయం చేజారిపోయింది. ఇప్పుడు ఏపిలో వైకాపాను చూసి అధికార తెదేపా భయపడే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. కనుక ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఏవిధంగా..ఎంత వేగంగా లక్ష్యం వైపు అడుగులు వేయాలో అర్ధం చేసుకొనేందుకు వైకాపాను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా అందుకు పూర్తివిరుద్దంగా అగమ్యంగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలను పరిశీలిస్తే, వాటి ద్వారా ఆయన కొత్తగా సాధించిందేమీ లేదనే అర్ధం అవుతోంది. కనుక కరీంనగర్ సభతో కూడా జనసేన కొత్తగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. 

అసలు జనసేన పార్టీ స్థాపనకు కారణం ఏమిటి...దాని విధివిధానాలు ఏమిటి? ఆశయాలు ఏమిటి? వచ్చే ఎన్నికలలో ఎన్ని సీట్లకు పోటీ చేయబోతోంది? తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేయాలనుకొంటోంది? అనే ప్రాధమిక సమాచారాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఇవ్వలేకపోయారు. అసలు ఇంతవరకు పార్టీలో పవన్ కళ్యాణ్ తప్ప మరెవరూ కనబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతవరకు పార్టీ కార్యవర్గం ప్రకటించకుండా అగమ్యంగా ముందుకు సాగుతున్న జనసేన తెలంగాణాలో ఏమీ సాధించలేకపోవచ్చు.    

కనుక కనీసం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ నిర్మాణంపైనే పూర్తి దృష్టిపెడితే మంచిది. లేకుంటే వచ్చే ఎన్నికల తరువాత అయన కూడా అన్నగారిలాగే మళ్ళీ టాలీవుడ్ బాట పట్టకతప్పదు.


Related Post