కెసిఆర్ లక్ష్యం కాంగ్రెస్ మాత్రమే: రేవంత్ రెడ్డి

April 24, 2018


img

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో దేవగౌడకు చెందిన జెడిఎస్ పార్టీకి కెసిఆర్, అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దేవగౌడ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేస్తామని వారిద్దరూ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ, వారిరువురిని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నడిపిస్తున్నారు. ఈ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించి అధికారంలోకి వచ్చేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. కనుక జెడిఎస్ ను ప్రోత్సహించినట్లయితే దానికి సీట్లు పెరుగుతాయి. ఆ కారణంగా కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తీయవచ్చునని, ఎన్నికల తరువాత జెడిఎస్ మద్దతుతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. కెసిఆర్ లక్ష్యం కాంగ్రెస్ పార్టీయే కానీ భాజపా కాదు.  ఒకవేళ నా వాదన నిజం కాదంటే, ఎన్నికల తరువాత భాజపా-జెడిఎస్ లు చేతులు కలుపవని కెసిఆర్ ప్రకటించగలరా?” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. 

కెసిఆర్ వెనుక అమిత్ షా ఉన్నారో లేదో తెలియదు కానీ కర్ణాటకలో జరుగబోయే ఎన్నికలలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని తాజా సర్వేలు చెపుతున్నాయి. ఒకవేళ ఆ సర్వే ఫలితాలు నిజమైతే అప్పుడు జెడిఎస్ మద్దతు కీలకం కాబోతోంది. అంటే కాంగ్రెస్, భాజపాలలో జెడిఎస్ దేనికి మద్దతు ఇస్తే అదే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందన్నమాట. ఒకవేళ భాజపాకు మద్దతు ఇస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమని నమ్మక తప్పదు. 

ఎన్నికల తరువాత అధికారం సంపాదించుకోవడం కోసం కాంగ్రెస్, భాజపాలలో ఏదో ఒక పార్టీతో జెడిఎస్ చేతులు కలుపడం తధ్యం. ఒకవేళ భాజపాను కాదని కాంగ్రెస్ పార్టీతో జెడిఎస్ చేతులు కలిపినా ధర్డ్ ఫ్రంట్ ఆశయానికి భంగం కలుగుతుంది. కనుక ఎన్నికల తరువాత జెడిఎస్ ఆ రెండు పార్టీలతో చేతులు కలపకుండా నివారించడం సాధ్యమేనా? అంటే అనుమానమే. ఈవిషయం కెసిఆర్ కు తెలియదనుకోలేము. కనుక జెడిఎస్ కు మద్దతు వెనుక కెసిఆర్ వ్యూహం ఏమిటో మున్ముందు స్పష్టం అవుతుంది. 


Related Post