కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తే అంతే...

April 24, 2018


img

మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. మెదక్ జిల్లాలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపని పార్టీలన్నీ భాజపాకు అనుకూలంగా పని చేస్తున్నాయని ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. మా పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేకుండానే వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది కానీ తెలంగాణాలో ఒక్క ప్రాజెక్టుకు కల్పించలేదు ఎందుకు?కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుంటారు. కానీ ఎప్పుడూ రాష్ట్రం గురించి మొసలి కన్నీళ్ళు కారుస్తుంటారు. వారికి నిజంగా రాష్ట్రంపై అంత ప్రేమ ఉన్నట్లయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఎందుకు పోరాడరు?” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. ఆ ఎన్నికలలో గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కల నెరవేరుతుంది లేకుంటే అయన ఇక ఎప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడుగానే మిగిలిపోవచ్చు. ఎందుకంటే మరో ఐదేళ్ళ తరువాత దేశంలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయో ఎవరూ ఊహించలేరు. కనుక 2019 ఎన్నికలలో విజయం సాధించడానికి భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలన్నిటినీ కూడగట్టి ‘మహాకూటమి’ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. 

కానీ ఇదే సమయంలో కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనతో కాంగ్రెస్, భాజపాలను వ్యతిరేకిస్తున్న పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ అయన ప్రయత్నాలు ఫలిస్తే, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది. కనుక తమ పార్టీతో చేతులు కలపని పార్టీలన్నీ భాజపాకు అనుకూలంగా పని చేస్తున్నాయని గట్టిగా ప్రచారం చేయడం ద్వారా వాటిపై ‘కాషాయముద్ర’ వేసి భయపెట్టి కాంగ్రెస్ పార్టీవైపు ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. మోడీ-కెసిఆర్ మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే పార్లమెంటులో తెరాస ఎంపిలు ఆందోళనలు చేసి అవిశ్వాస తీర్మానాలను అడ్డుకొన్నారని కాంగ్రెస్ ఆరోపించడం అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

దేశంలో భాజపా, శివసేన పార్టీలు తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా తమవి ‘సెక్యులర్ పార్టీ’లుగా చెప్పుకోవడానికే ఇష్టపడతాయి. కనుక ‘సెక్యులర్ ముద్ర’ కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపక తప్పనిసరి పరిస్థితులు కల్పించాలని ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అదే ముక్క మంత్రి హరీష్ రావు క్లుప్తంగా చెప్పారు.



Related Post