ధర్డ్ ఫ్రంట్ విశ్వసనీయతకు పరీక్ష: కర్ణాటక ఎన్నికలు

April 23, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకిస్తూ వాటికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న ధర్డ్ ఫ్రంట్ పై కాంగ్రెస్ నేతలు గట్టిగానే స్పందిస్తున్నారు. రాష్ట్ర భాజపా నేతలు కూడా మొక్కుబడిగా స్పందించినప్పటికీ భాజపా అధిష్టానం మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

కెసిఆర్ ఫ్రంట్ ప్రకటన చేసిన తరువాతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో తెరాస ఎంపిలు మోడీ సర్కాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు రాకుండా అడ్డుకొన్నారు. తద్వారా వారు మోడీ సర్కార్ రక్షణకవచంలా పనిచేశారనే విమర్శలు వచ్చాయి. మోడీ, భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చి, వచ్చే ఎన్నికలలో మళ్ళీ భాజపా విజయం సాధించడానికి తోడ్పడటానికే కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు సఫలం అవుతాయా లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే అయన నిజంగానే కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా దానిని ఏర్పాటు చేస్తున్నారా? దాని ఏర్పాటు వెనుక కెసిఆర్ అసలు ఉద్దేశ్యం ఏమిటి?అనే సందేహాలు కలుగుతున్నాయి. అందుకు కారణం పార్లమెంటు సమావేశాలలో తెరాస ఎంపిలు ఆవిధంగా వ్యవహరించడమే!

అయితే ఆ తరువాత కెసిఆర్ బెంగళూరు వెళ్ళి దేవగౌడతో ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడివచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జెడిఎస్ తరపున ప్రచారం చేయడానికి సిద్దం అని ప్రకటించారు. వచ్చే నెల మొదటివారంలో ఓడిశా వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడబోతున్నారు. ఒకవేళ కెసిఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని భాజపా ఓటమికి కారకుడైతే, అయన నిజంగానే భాజపాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అప్పుడు ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అయన చెపుతున్న కారణాలు నిజమేనని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు నమ్మే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్, భాజపాలను గట్టిగా డ్డీకొని వాటిని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే, అప్పుడు ఇతర రాష్ట్రాలలోని కాంగ్రెస్, భాజపాలను వ్యతిరేకిస్తున్న పార్టీలు ఆయనతో చేతులు కలపడానికి ముందుకు రావచ్చు. కానీ ఆ ఎన్నికలలో భాజపా విజయం సాధిస్తే, భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చడానికే ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారనే కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూరుతుంది. కనుక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ ఏవిధంగా వ్యవహరించబోతున్నారనే దానిపై ధర్డ్ ఫ్రంట్ విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది. 


Related Post