ఇంతకీ పవన్ కళ్యాణ్ పోరాటం దేనికి..ఎవరితో?

April 21, 2018


img

శ్రీరెడ్డి ఆరోపణలతో టాలీవుడ్ లో మొదలైన గొడవ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు మీడియాకు మద్య పోరాటంగా మారడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు సమస్యను పక్కకుపోయి ఇప్పుడు ఇదే హైలైట్ అవుతోంది. 

“పవన్ కళ్యాణ్ ను తిడితే శ్రీరెడ్డి పోరాటానికి హైప్ వస్తుంది కనుక నేనే తిట్టమన్నాను...సురేష్ బాబును కాపాడేందుకు శ్రీరెడ్డితో 5 కోట్లు డీల్ చేయడానికి ప్రయత్నించాను...,” అంటూ రామ్ గోపాల్ వర్మ నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో మెగా ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చింది. వారిలో మెయిన్ హీరో మాత్రం పవన్ కళ్యాణే. ఎందుకంటే ఆయన ఒక్కరే చంద్రబాబు, లోకేష్, తెదేపా నేతలను, మీడియాను, వాటి వెనుక ఉన్న బలమైన వ్యక్తులతో యుద్ధం చేస్తున్నారు.

దీంతో శ్రీరెడ్డి లేవనెత్తిన ‘కాస్టింగ్ కౌచింగ్’ సమస్య పక్కకు పోయి దానిస్థానంలో వీరి యుద్ధాలు హైలైట్ అవుతున్నాయిప్పుడు. ఇంతకాలం సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులపై ఆకృత్యాలకు పాల్పడినవారందరూ తమ ప్రమేయం లేకుండానే ఈ సమస్య నుంచి బయటపడినట్లు కనిపిస్తోంది. 

పవన్ కళ్యాణ్ తల్లిని కించపరిచినందుకు శ్రీరెడ్డి, ఆమెను ప్రోత్సహించినందుకు రామ్ గోపాల్ వర్మ క్షమాపణలు చెప్పుకొన్నారు. కనుక ఇక్కడితో ఈ సమస్య ముగించి, శ్రీరెడ్డి లేవనెత్తిన ‘టాలీవుడ్ లో లైంగిక వేధింపులు’ సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించి ఉండి ఉంటే ఆయనకు మరింత గౌరవం దక్కి ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ దానిని పక్కనపెట్టి, ఈ సమస్యపై చర్చించిన మీడియాపై, వాటి వెనుక వ్యక్తులపై యుద్ధం ప్రకటించి తప్పటడుగు వేశారని చెప్పవచ్చు. తద్వారా తెదేపాతో తనకున్న గొడవలను ఆయన ఈవిధంగా ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం కలిగించారు. వాస్తవానికి అది వేరే అంశమని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాలలో నిలద్రొక్కుకోక మునుపే, అటు మిత్రపక్షాలను, మీడియాను దూరం చేసుకోవడం వలన మున్ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసిరావచ్చు. 

ఇక పవన్ కళ్యాణ్ “బట్టలిప్పి మాట్లాడుకొందాము...ఫలానా టీవీ ఛానల్స్ ను అందరూ బహిష్కరించండి..స్టే ట్యూన్‌డ్‌..లైవ్‌ ఫ్రమ్‌ హైదరాబాద్‌..నిజాలని నిగ్గు తేలుద్దాం ప్రోగ్రాం నుంచి విత్‌ కెమెరామ్యాన్‌ ట్విటర్‌ తో మీ పవన్‌ కళ్యాణ్‌’ అంటూ అయన పెట్టిన ట్వీట్ మెసేజులు అభిమానులను ఆకట్టుకోగలవేమో కానీ మిగిలినవారికి అవి రాజకీయ అపరిపక్వతగా కనిపిస్తే ఆశ్చర్యం లేదు. 

చివరాఖరిగా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరిపై ఎందుకు ఈ పోరాటం చేస్తున్నారు? శ్రీరెడ్డి లేవనెత్తిన ‘టాలీవుడ్ లో లైంగిక వేధింపులు’ సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ ఏమైనా చేస్తారా? లేక ఆ సమస్య కంటే తన కుటుంబ ప్రతిష్టే ముఖ్యం అని కనబడని ఆ ‘రాజకీయ అజ్ఞాతవాసులతో’ న్యాయపోరాటలు చేస్తూ ఎదురుదెబ్బలు తింటారా? అసలు తన గమ్యం ఏమిటి? దానిని చేరుకోవడానికి ఇదే దగ్గర మార్గామనుకొంటున్నారా? అనే ప్రశ్నలకు రాబోయే రోజులలో సమాధానాలు దొరుకుతాయి. 


Related Post