తెరాస సెల్ఫ్ గోల్ చేసుకొంటోందా?

April 20, 2018


img

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించలేరు. వారిరువురిపై చర్య తీసుకొనే ముందు వారిని స్పీకర్ సంజాయిషీ కోరలేదు. అలాగే పద్ధతి ప్రకారం శాసనసభ వ్యవహారాల కమిటీకి పిర్యాదు చేసి దాని చేత విచారణ జరిపించలేదు. 

వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేసినప్పుడు ఏపి సర్కార్ కూడా తొందరపడి వ్యవహరించి ఇలాగే ఎదురుదెబ్బలు తింది. అ తరువాత పద్ధతి ప్రకారం శాసనసభ వ్యవహారాల కమిటీకి పిర్యాదు చేసి, దాని చేత విచారణ జరిపించి, దాని సిఫార్సు మేరకే ఏడాదిపాటు సస్పెండ్ చేయడంతో సుప్రీం కోర్టు కూడా ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. 

రోజా కేసును ప్రామాణికంగా తీసుకొని తెరాస సర్కార్ పద్ధతి ప్రకారం ముందుకు సాగి ఉండి ఉంటే ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు తప్పి ఉండేవి కదా. కానీ ఒకసారి హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న తరువాత కూడా మళ్ళీ దూకుడుగా వ్యవహరిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో రిట్ పిటిషన్ వేయించింది.

కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాల రద్దు విషయంలో తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలలో కూడా భిన్నాభిప్రాయాలున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవే నిజమైతే దీనిపై పార్టీలో అంతర్గతంగా కూడా అసంతృప్తి ఏర్పడిందని భావించవచ్చు. అంటే మరో కొత్త సమస్యను సృష్టించుకొందన్న మాట.

ఈ కేసులో తెరాస సర్కార్ వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. ప్రభుత్వం తరపున వాదించిన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ కారణంగా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించలేకపోవడం వలన హైకోర్టు మొట్టికాయలు వేసింది. చివరికి కాంగ్రెస్ సభ్యుల సభ్యత్వం రద్దు చెల్లదని కేసు కొట్టేసింది. 

వరుసగా ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ప్రభుత్వం పంతానికి పోకుండా హైకోర్టు తీర్పును గౌరవించి ఉంటే ఇక్కడితో ఈ సమస్య ముగిసిపోయేది. కానీ మళ్ళీ పిటిషన్ వేసి చేజేతులా సమస్యలను ఆహ్వానిస్తున్నట్లుంది. ఒకవేళ ఈసారి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే దాని వలన ప్రభుత్వానికి మరింత అప్రదిష్ట కలుగుతుంది. అప్పుడు వెనక్కు తగ్గిన్నా జరుగకూడని నష్టం అప్పటికే జరిగిపోతుంది కనుక ఏమీ ప్రయోజనం ఉండదు. 


Related Post